గొడ్డలితో పనిలేకుండా… గోటితోనే పని పూర్తి చేసిన జగన్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ప్రభుత్వం ఎన్ని విమర్శలు కాచుకోవాల్సి వచ్చిందో అందికీ తెలిసిన విషయమే. హుటాహుటిన ఆర్డినెన్స్ తో రమేష్ కుమార్ ని తొలగించి జస్టిస్ కనగరాజ్ ని ఎస్ఈసీగా నియమించి… చివరకు కోర్టు తీర్పు, గవర్నర్ సూచనతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇంత చేసినా ఇప్పుడు ఎస్ఈసీగా నిమ్మగడ్డ తిరిగి తన కుర్చీలో కూర్చున్నారు.

చంద్రబాబు అనుచరుడని, బీజేపీ నేతల్ని రహస్యంగా హోటల్ లో కలిశారని.. ఇలా ఎన్ని విమర్శలు చేసినా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి కొన్ని అధికారాలుంటాయి, నచ్చినా నచ్చకపోయినా వాటిని ప్రభుత్వం అంగీకరించాల్సిందే.

అయితే ఇప్పటి వరకూ నిమ్మగడ్డ వ్యవహారంలో పంతాలకు పోయినట్టు కనిపించిన సీఎం జగన్, ఇప్పుడు కాస్త తెలివిగా వ్యవహారం చక్కబెట్టినట్టు తెలుస్తోంది. గవర్నర్ ఆదేశాలతో తిరిగి ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రావడంతోనే.. స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దుచేసి, కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారని, టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తారని సోషల్ మీడియాలో ఒకటే కథనాలొచ్చాయి. దీంతో సహజంగానే వైసీపీలో అనుమానాలు తలెత్తాయి. గతంలో ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో కరోనాని ఒక కారణంగా చెప్పినా.. ఏకగ్రీవాలని ఒప్పుకునే ప్రసక్తేలేదన్నారు రమేష్ కుమార్. పలువులు ఐఏఎస్ లను కూడా బదిలీచేశారు. కానీ ఆ నిర్ణయాలేవీ అమలులోకి రాకుండానే మధ్యలో పెద్ద కథ నడిచింది.

తిరిగి ఇప్పుడు ఎన్నికలంటే.. రమేష్ కుమార్ ఊరుకుంటారా, ఏకగ్రీవాలను ఒప్పుకుంటారా, అధికారులను బదిలీ చేయకుండా ఆగుతారా? అయితే సీన్ అంతవరకు రాకుండానే రక్తి కట్టించారు సీఎం జగన్. అసలు ఈ ఏడాది ఎన్నికలే లేకుండా నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప జిల్లాల్లోని మున్సిపాల్టీల్లో డిసెంబర్ 31వరకు, మిగతా చోట్ల జనవరి 2 వరకు పాలన పొడిగించారు.

శ్రీకాకుళం కార్పొరేషన్లో అక్టోబర్ 10వరకు, మిగతా కార్పొరేషన్లలో డిసెంబర్ 31వరకు ప్రత్యేక అధికారులే పాలన సాగిస్తారు. అంటే ఈ ఏడాది ఇక మున్సిపాల్టీల్లో ఎన్నికలు లేవన్నమాట. వచ్చేఏడాది ఏప్రిల్ తో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి. ఆలోపు నోటిఫికేషన్ జారీ చేసినా.. ఆయన హయాంలో మాత్రం ఎన్నికలు పూర్తి కావు. అంటే ఒకరకంగా నిమ్మగడ్డను పూర్తిగా ఎన్నికలకు దూరం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట.

ఎన్నికల వాయిదాకు కరోనా కారణాన్ని చూపిన నిమ్మగడ్డకు రేపు ప్రభుత్వం తరపున కూడా అదే సమాధానం వినిపించవచ్చు. అంటే అసలు నిమ్మగడ్డను టచ్ చేయకుండానే ఆయనకి పనిలేకుండా చేశారు జగన్. ఈసారి గొడ్డలి దాకా పోకుండా గోటితోనే పని పూర్తి చేశారు.