ఎట్టకేలకు బయటకొచ్చిన ప్రభాస్

లాక్ డౌన్ కంటే ముందే ఇంటికి ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. ఆ తర్వాత కరోనా సీజన్ లో కూడా షూటింగ్ చేశాడు. అయితే వారం రోజులకే ప్యాకప్ చెప్పేసి మళ్లీ ఇంటికే పరిమితమైపోయాడు. అలా 4 నెలలుగా ఇంటిపట్టునే ఉన్న ప్రభాస్, ఎట్టకేలకు బయటకొచ్చాడు. హైదరాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేశాడు ఈ హీరో.

ప్రభాస్ కు చెందిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ గడువు పూర్తయింది. దీంతో దాన్ని రెన్యూవల్ చేయించుకునేందుకు ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లాడు ఈ హీరో. అయితే కరోనా తీవ్రంగా విజృంభిస్తుండడంతో పూర్తి జాగ్రత్తలతో బయటకొచ్చాడు. ముఖానికి మాస్క్ వేసుకోవడమే కాకుండా, అద్దాలు కూడా పెట్టుకున్నాడు.

ఎప్పుడు బయటకొచ్చినా అభిమానులతో సెల్ఫీలు దిగే ప్రభాస్, ఈసారి అన్నింటికీ దూరంగా ఉన్నాడు. అభిమానులను ప్రాంగణంలోకి కూడా అనుమతించలేదు. ఇక ఉద్యోగులతో కూడా ఫొటోలు దిగడానికి ప్రభాస్ సున్నితంగా నిరాకరించాడు.

మొత్తమ్మీద చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ బయటకు రావడంతో, ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.