చంద్రబాబు ఆర్థిక మూలాలపై గట్టి దెబ్బ…

అమరావతి తరలిపోతోంది, రాష్ట్రానికి నష్టం జరుగుతోంది, కొన్ని తరాలు బాధపడాల్సి వస్తోందంటూ.. ఆవేదన పడుతున్నారు చంద్రబాబు. ఇక్కడ కొన్ని తరాలు అంటే.. ఆయన కుటుంబానికి చెందిన కొన్ని తరాలు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అమరావతిలో చంద్రబాబు ఆర్థిక మూలాలున్నాయి.

అమరావతిని రాజధానిగా ఎంపిక చేసే ముందు చంద్రబాబు, ఆయన బినామాలు, ఆయన సహచర నాయకులు.. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలు కొని పెట్టుకున్నారో రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  బయటపెట్టారు. అప్పట్లో అవన్నీ ఆరోపణలేనని కొట్టిపారేసినా.. ఇప్పుడు అన్ని విషయాలూ బైటపడుతున్నాయి.

మొదట్లో రాజధాని తరలింపు రైతుల సమస్యగా అభివర్ణించిన చంద్రబాబు.. రాను రాను దీన్ని రాష్ట్ర ఆర్థిక సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచి, మిగతా విభాగాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే వచ్చే నష్టం కంటే.. అన్నీ అమరావతిలోనే పెట్టాలనుకునే తాపత్రయం వల్ల రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు కలిగే నష్టం ఎక్కువ. ఇతర రాష్ట్రాలు, దేశాలనుంచి వచ్చే కంపెనీలు రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి రాయితీలుస్తుంది, అనుకూలంగా ఉంటుందా లేదా అనే విషయాలను ఆలోచిస్తాయి కానీ, రాజధాని అమరావతా, విశాఖా అని ఆలోచించరు.

ఇక్కడ చంద్రబాబు చెబుతున్న ఆర్థిక నష్టం అనేది పసలేని వాదనగా తేలిపోతుంది. ఇక చంద్రబాబుకి జరిగే ఆర్థిక నష్టమే ఎక్కువగా ఉంది. చంద్రబాబు అనుచరులు, గతంలో మంత్రివర్గ సహచరులు, ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్న నమ్మినబంటులు, కొన్ని మీడియా సంస్థల అధినేతలు.. అందరూ అమరావతిలో పెట్టుబడి పెట్టారు. దానికి చంద్రబాబు హామీదారుగా ఉన్నారు, ఐదేళ్లలో తాను చేయగలిగిందంతా చేశారు.

తీరా ప్రభుత్వం మారి మూడు రాజధానులు అనే సరికి వీరి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. చంద్రబాబుని నమ్మి తాము నిండా మునిగామనే భావనలో ఉన్నారు. వీరికోసమే రైతుల్ని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లూ అమరావతిపై లేనిపోని ప్రేమ కురిపించారు చంద్రబాబు.

అమరావతి ఆశలు గల్లంతయితే ఆ ఆర్థిక మూలాలన్నీ దెబ్బతిన్నట్టే. గతంలో లాగా తనకు, పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేవారు ఎవరూ ఉండరు. ఎవరికీ ఆయనపై భరోసా ఉండదు. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉన్నవేళ, బీజేపీ, జనసేనపై బాబు పట్టు కోల్పోతున్న వేళ.. ఆయనకు ఆర్థిక అండదండలు కచ్చితంగా అవసరం.

అదే లేకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు ఆయుధం లేకుండా బరిలో దిగినట్టే లెక్క. అందుకే చంద్రబాబు అమరావతికోసం పరితపించిపోతున్నారు. కూలిపోతున్న తన ఆర్థిక మూలాలను చూసి కుమిలిపోతున్నారు.