రామ్ చరణ్ చేతికి బన్నీ సినిమా

ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరి చేతికి వెళ్లడం ఇండస్ట్రీలో చాలా కామన్. కాల్షీట్లు కుదరక కొంతమంది, కథ నచ్చక మరికొంతమంది సినిమాలు వదిలేస్తుంటారు. మొన్నటికిమొన్న మహేష్ చేయాల్సిన పుష్ప సినిమా బన్నీ చెంతకు చేరిన సంగతి తెలిసిందే. అలానే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాల్సిన మరో సినిమా కూడా బన్నీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ చేయాల్సిన ఓ సినిమా రామ్ చరణ్ గుమ్మం ముందు వాలింది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు అల్లుఅర్జున్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనతో పాటు ప్రీ-లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది. అయితే అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత బన్నీ ఈక్వేషన్స్-కాలిక్యులేషన్స్ మారిపోయాయి. అందులో భాగంగా ఐకాన్ సినిమాను ఆయన పక్కనపెట్టి, కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో ఐకాన్ మూవీని ఇప్పుడు రామ్ చరణ్ తో చేయాలని దర్శకుడు దిల్ రాజు అనుకుంటున్నాడు. పెద్ద హీరోల్లో రామ్ చరణ్ ఒక్కడే ఎలాంటి కొత్త సినిమాలు ప్రకటించకుండా కామ్ గా ఉన్నాడు. అతడితో ఐకాన్ చేయడానికి ఒప్పిస్తే, ప్రాజెక్ట్ వెంటనే సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. దిల్ రాజు రంగంలోకి దిగాడు కాబట్టి పనైపోతుందేమో చూడాలి.