వెలగపూడిపై బీజేపీ వేటు

ఏపీ బీజేపీలో వేట కొనసాగుతోంది. పార్టీ లైన్‌ను లెక్క చేయని నేతలను పార్టీ నుంచి బయటకు పంపించే చర్యలు ఊపందుకున్నాయి. బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణపై బీజేపీ చర్యలు తీసుకుంది.

అమరావతికి అండగా తమ పార్టీ ఉండలేకపోతోందని… మందడం రైతు శిబిరంలో వెలగపూడి గోపాలకృష్ణ చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపారు. ఈ వార్తను, ఫోటోను టీడీపీ పత్రిక ఒకటి తొలి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. అమరావతి భూములిచ్చిన వారు బీజేపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కానీ నేటి పరిస్థితి చూస్తుంటే తన చెప్పుతో తానే కొట్టుకోవాలనిపిస్తోందంటూ చెప్పుతో కొట్టుకున్నారు వెలగపూడి.

తానిచ్చిన భూమిలో బీజేపీ కార్యాలయం నిర్మించకపోతే దాన్ని విక్రయించి ఆ సొమ్మును అమరావతి పోరాటానికి ఖర్చు చేస్తానని వెలగపూడి గోపాలకృష్ణ ప్రకటించారు. బీజేపీకి నష్టం చేకూర్చేలా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ సీరియస్‌గా స్పందించింది. వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ ఒక ప్రకటనలో ప్రకటించింది.