వీర్రాజు దెబ్బకు చంద్రబాబు విలవిల….

ఏపీలో టీడీపీ అధికారంలో అయినా ఉండాలి, లేదా ప్రతిపక్షంలో అయినా ఉండాలి.. మూడో ప్రత్యామ్నాయానికి చోటే ఉండకూడదు. ఇదీ చంద్రబాబు లెక్క.

అందుకే కొత్తగా వచ్చే పార్టీలయినా, బలపడాలనుకుంటున్న పాత పార్టీలయినా చంద్రబాబు కుట్ర రాజకీయాలకు బలవుతూనే ఉంటాయి. జనసేనాని పవన్ కల్యాణ్ ని పూర్తిగా తన చెప్పుచేతల్లో పెట్టుకుని సొంత బలం లేని వ్యక్తిగా మార్చేశారు చంద్రబాబు. వామపక్షాలను కూడా అవసరం అనుకున్నన్ని రోజులు వాడుకుని, తర్వాత జనసేనకు అటాచ్ చేశారు. ఇప్పుడు మళ్లీ వామపక్ష నాయకుల్ని తమ పంచన చేర్చుకున్నారు చంద్రబాబు.

ఇక బీజేపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వెంటనే టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారు చంద్రబాబు. ఎవరి స్వప్రయోజనాలు వారికి ఉన్నా.. అంతిమంగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనానికి కూడా వారు దోహదపడుతున్నారు.

ఏపీలో వైసీపీపై విమర్శలు చేస్తూ, అమరావతికి మద్దతిస్తూ సుజనా చౌదరి ఇంకా టీడీపీ నాయకుడిలాగే ప్రవర్తిస్తుంటారు. ఇక నిన్న మొన్నటి వరకూ ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగానే ఉంది. ముందు చంద్రబాబు సెలవిస్తారు, తర్వాత అదే విషయాన్ని కన్నా అందుకుంటారు, ఆ తర్వాత జనసేనాని రాద్ధాంతం చేస్తారు. ఇలా సాగేది ఏపీ రాజకీయం. కానీ వీర్రాజు రాకతో ఒక్కసారిగా అంతా మారిపోయింది. ఎక్కడికక్కడ బీజేపీలో బాబు బ్యాచ్ కి చెక్ పెడుతూ వస్తున్నారు కొత్త నాయకుడు.

రాష్ట్ర రాజధాని ఎంపికలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది అని సెలవిచ్చిన సుజనా చౌదరికి బహిరంగంగానే బ్రేక్ వేశారు వీర్రాజు. అధికారికంగా సుజనా వ్యాఖ్యలను ఖండించి.. మరోసారి నోరెత్తకుండా చేశారు. ఈ పరిణామం చంద్రబాబుకి మింగుడు పడని వ్యవహారం.

అంతే కాదు.. టీడీపీ ఓటు బ్యాంకుని కచ్చితంగా లాగేసుకుంటామంటూ వస్తూ వస్తూనే బాబుకి షాకిచ్చారు వీర్రాజు. ఇప్పుడిక పార్టీలో ఏరివేత మొదలు పెట్టారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణపై ఇటీవలే వీర్రాజు వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పార్టీకి వ్యతిరేకంగా ఓ ఆర్టికల్ ప్రచురించారని ఆయన్ను పక్కనపెట్టారు.

తాజాగా వెలగపూడి గోపాల కృష్ణపై వేటు పడింది. వెలగపూడికి గతంలో ఓ సెక్యూరిటీ సర్వీెసెస్ కంపెనీ ఉండేది. ఆయన సర్వీసెస్ ని టీడీపీ ప్రభుత్వం కూడా ఉపయోగించుకుంది. దానికి ప్రత్యుపకారంగా బీజేపీలోనే ఉంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేవారట వెలగపూడి.

ఇటీవల అమరావతి నిరసనల్లో పాల్గొన్న ఆయన రైతులకు బీజేపీ అండగా నిలబడలేకపోయిందని, తాము ఏమీ చేయలేకపోతున్నామని తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఆ వార్తను టీడీపీ అనుకూల మీడియా బాగా హైలెట్ చేసింది. ఈ ఘటనతో రాష్ట్ర బీజేపీ కూడా అమరావతికి మద్దతు తెలుపుతుందని ఆలోచించారు బాబు.

కానీ ఆయన అనుకున్నదొకటి, అయినది మరొకటి. ఏకంగా వెలగపూడిపై బీజేపీ వేటు వేసింది. వీరంతా పెద్ద నాయకులు కాకపోవచ్చు, వీరిని కొనసాగిస్తే బీజేపీకి కలిగే నష్టం, తీసేస్తే వచ్చే లాభం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబుకి ఓ గట్టి మెసేజ్ పంపాలనే ఉద్దేశంతోటే వీర్రాజు ఈ తరహా కార్యక్రమాల్ని ముమ్మరం చేశారని అర్థమవుతోంది.

ఇకపై బీజేపీలో ఉంటూ టీడీపీకి వంతపాడాలంటే ఎవరైనా ఆలోచించాల్సిన పరిస్థితే. అంటే చంద్రబాబు పప్పులు ఇకపై ఉడకవన్నమాట. వైసీపీతోపాటు.. బీజేపీ, జనసేనను కూడా ఆయన ఓ కంట కనిపెట్టాల్సిందే.