నేపాల్ ఆర్మీకి 10 వెంటిలేటర్లు ఇచ్చిన భారత్ ఆర్మీ

ఎన్నో దశాబ్దాలుగా మిత్రదేశంగా ఉన్న నేపాల్ కూడా ఈ మధ్య ఇండియాను కవ్విస్తున్నది. మన దేశంలో అంతర్భాగంగా ఉన్న ప్రాంతాలను కూడా తమవే అని చెప్పుకుంటూ రెచ్చగొడుతున్నది. ముఖ్యంగా ఓలి శర్మ నేపాల్‌కు ప్రధాని అయిన నాటి నుంచి మిత్రదేశం కాస్తా శత్రు దేశంగా రూపాంతరం చెందుతూ వస్తున్నది. ఎప్పటికప్పుడు ఓలి తన అక్కసును భారత్‌పై వెల్లగక్కుతూ ఉన్నాడు.

భూకంపాలు, వరదల సమయంలో ఎంతో సాయం చేసిన భారత్‌నే వెన్నుపోటు పొడవడానికి కూడా ఓలి శర్మ వెనుకాడలేదు. మన దేశానికి చెందిన భూభాగాలను నేపాల్‌వే అని పేర్కొంటూ మ్యాప్స్ విడుదల చేయడమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. శ్రీరాముడు పుట్టింది అయోధ్యలో కాదని, నేపాల్‌లోనే ఆయన పుట్టాడని వ్యాఖ్యానించాడు. ఇలా ప్రతి నిత్యం భారత్‌పై విషం వెల్లగక్కుతూ వచ్చాడు. దీనంతటి వెనుక చైనా ఉందన్న విషయం భారత్‌కు తెలుసు. అయినా నేపాల్ కవ్వింపు చర్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు.

ప్రస్తుతం ప్రపంచ దేశాలు కరోనాతో విలవిల్లాడుతున్నాయి. దీనికి నేపాల్ కూడా అతీతం ఏమీకాదు. అక్కడ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళనకు గురైంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో కనీసం వెంటిలేటర్లు కూడా సమకూర్చుకునే స్థితి లేకుండా పోయింది. దీంతో నేపాల్ వైద్యరంగాన్ని ఆదుకోవడానికి భారత్ ముందడుగు వేసింది. ముందుగా 10 వెంటిలేటర్లను నేపాల్ దేశానికి ఇవ్వాలని నిర్ణయించింది.

నేపాల్‌లోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఈ పది వెంటిలేటర్లను నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పూర్ణ చంద్ర థాపాకు నేపాల్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో అందజేశారు. ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా ఇండియాలోనే తయారు చేసిన రూ. 2.8 కోట్ల విలువైన వెంటిలేటర్లను నేపాల్‌కు అందించింది. దీంతో భారత్ యొక్క మానవత్వం మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం ఇండియాకు ఉందని నిరూపణ అయ్యింది. నేపాల్ ప్రధాని భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నా.. ఆ దేశానికి కష్టకాలంలో బాసటగా నిలిచింది.