జూనియర్ ఎన్టీఆర్‌ కూడా కాపాడలేడు

ఇష్టమైన నాయకులపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తుంటారు… అందుకే తనకు చంద్రబాబు అంటే కోపమని మంత్రి కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు చర్యలను గట్టిగా తిప్పికొట్టకపోతే వ్యక్తిత్వాన్ని నాశనం చేసి జగన్‌మోహన్ రెడ్డిని కూడా ఎన్టీఆర్‌లా దెబ్బతీస్తారన్న ఉద్దేశంతోనే తాను గట్టిగా మాట్లాడుతుంటానన్నారు.

చంద్రబాబును బూతులు తిట్టిన వారిలో తొలి వ్యక్తి ఎన్టీఆరే ఉంటారన్నారు. ఆయన చెప్పిన మాటలనే తాము ఇప్పుడు గుర్తు చేస్తుంటామన్నారు. హరికృష్ణను పక్కన పెట్టడం జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని వదిలేయడం చూసిన తర్వాత చంద్రబాబుతో ఉంటే భవిష్యత్తులో తనకూ అదే గతి పడుతుందన్న భావనతోనే బయటకు వచ్చానన్నారు.

టీడీపీకి ఎక్స్‌పెయిరీ డేట్ అయిపోయిందని… దాన్ని కాపాడాలని ప్రయత్నం చేయడం సాధ్యం కాదన్నారు. జూనియర్‌ ఎన్టీఆరో మరొకరో వచ్చి దాన్ని కాపాడే పరిస్థితి అయితే లేదన్నారు.

చంద్రబాబు నాయకత్వంలోనికి టీడీపీ వచ్చిన తర్వాత తెలంగాణలో కనీసం అభ్యర్థులను నిలిపే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నామ్‌కేవాస్తిలాగా 100 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టుకునే స్థాయికి టీడీపీని చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. నాలుగు నెలలుగా ఒక గదికి చంద్రబాబు పరిమితం అయ్యారన్నారు.

ఏపీకి బీజేపీ కరోనా ఆల్‌రెడీ వచ్చేసిందన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిందిపోయి చంద్రబాబు ఎన్నికల ముందు మాస్కులు, చొక్కాలు తీసేసి బీజేపీపై ఎగబడ్డారని… కాబట్టి బీజేపీ కరోనా చంద్రబాబును, టీడీపీని వదిలే అవకాశమే లేదని కొడాలినాని చెప్పారు.