కనీసం క్రిస్మస్ కైనా వస్తుందా?

అనుకున్న టైమ్ కు రిలీజై ఉంటే ఈ పాటికి వంద రోజుల వేడుక జరిగి ఉండేది. కానీ కరోనా కారణంగా నాని నటించిన V అనే సినిమా విడుదలకు నోచుకోలేదు. మార్చి 25న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా 4 నెలలైనా ఇంకా ల్యాబ్ లోనే ఉండిపోయింది. మధ్యలో భారీ ఓటీటీ ఆఫర్లు వచ్చినప్పటికీ దిల్ రాజు థియేట్రికల్ రిలీజ్ కే ఫిక్స్ అయ్యాడు. అలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాపై మరోసారి దృష్టిపెట్టాడు దిల్ రాజు. అన్నీ అనుకున్నట్టు జరిగితే క్రిస్మస్ కు V సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

నిజానికి ఈ నెలాఖరు నుంచి సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఉంది. అన్ లాక్ లో భాగంగా ఆల్రెడీ జిమ్స్ కు అనుమతులు ఇచ్చేశారు. ఇదే ఊపులో నెలాఖరుకు లేదా వచ్చేనెల మొదటి వారానికి మల్టీప్లెక్సులకు కూడా పర్మిషన్లు వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే అనుమతులు ఇచ్చినంత మాత్రాన జనాలు థియేటర్లకు వస్తారనే గ్యారెంటీ లేదు. అందర్లో కరోనా భయం ఉంది. కాబట్టి ఈ టైమ్ లో V సినిమాను రిలీజ్ చేసినా ఉపయోగం ఉండదనేది దిల్ రాజు అభిప్రాయం.

మరోవైపు నానికి డిసెంబర్ సెంటిమెంట్ ఉండనే ఉంది. అతడు నటించిన ఎంసీఏ సినిమా డిసెంబర్ లోనే విడుదలై ఘనవిజయం సాధించింది. పైగా అది కూడా దిల్ రాజు సినిమానే. ఈ సమీకరణాలన్నీ చూసుకొని, V సినిమాను కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

కరోనా వల్ల ఆఖరి నిమిషంలో ఆగిపోయిన పెద్ద సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది V మూవీ. ఇప్పుడు కరోనా తర్వాత రిలీజయ్యే మొదటి పెద్ద సినిమాగా కూడా ఇదే నిలవబోతోంది.