బాలీవుడ్ పై ప్రీతి జింగ్యానీ సెటైర్లు

బాలీవుడ్ చీకటి కోణాలపై తారలంతా ఒక్కొక్కరుగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కంగనా రనౌత్ ధైర్యంగా ముందుకొచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు చాలామందికి ధైర్యం వచ్చింది. ఇప్పుడీ లిస్ట్ లోకి పవన్ హీరోయిన్ ప్రీతి జింగ్యానీ కూడా చేరిపోయింది.

పవన్ సరసన తమ్ముడు అనే సినిమాలో నటించి టాలీవుడ్ లో పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో చీకటి కోణాలపై స్పందించింది. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ.. కొన్ని గ్రూపులు బాలీవుడ్ లో మనల్ని ఎదగనివ్వవని, బయటకు తోసేయడానికే ప్రయత్నిస్తాయని కుండబద్దలుకొట్టింది ప్రీతి. అలాంటి గ్రూపుల్ని దాటుకొని, ధైర్యంగా నిలబడినప్పుడే అంతోఇంతో గుర్తింపు వస్తుందని చెప్పుకొచ్చింది. సెన్సిటివ్ గా ఉంటే బాలీవుడ్ లో నెగ్గుకు రాలేం అంటోంది.

మరోవైపు నెపొటిజంపై కూడా తనదైన శైలిలో స్పందించింది ఈ బ్యూటీ. బ్యాక్ గ్రౌండ్ ఉన్న తారలకు తప్పులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయంటోంది. ఒక తప్పు చేసినా మరో సినిమా వస్తుందని, మరో తప్పు చేసినా ఇంకో సినిమా ఆఫర్ వస్తుందని చెప్పుకొచ్చింది. అదే బ్యాక్ గ్రౌండ్ లేని నటీనటులకైతే కెరీర్ ముగిసిపోవడానికి ఒక్క తప్పు చాలంటోంది.