ఎయిమ్స్ లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య !

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో ఎంబిబిఎస్ చదువుతున్న 22 ఏళ్ల వికాస్ హాస్టల్ భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2018 బ్యాచ్ కి చెందిన వికాస్ బెంగళూరు వాస్తవ్యుడు.

మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వికాస్… ఎయిమ్స్ ట్రామా సెంటర్ లోని  సైకియాట్రి విభాగంలో  డిప్రెషన్ కి చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. వికాస్ ఒక గంట పాటు బయటకు వెళతానని చెప్పి తాను ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వార్డ్ నుండి బయటకు వచ్చాడు. తరువాత హాస్టల్ పైకి వెళ్లి అక్కడి నుండి దూకేశాడని పోలీసులు వెల్లడించారు. వికాస్ ఆత్మహత్యకు కారణం తెలియలేదని… తదుపరి విచారణ జరుగుతుందని వారు తెలిపారు.

గత నెలలో ఎయిమ్స్ లోని డాక్టర్ల హాస్టల్ లో పదవ అంతస్తు నుండి దూకి అనురాగ్ కుమార్ అనే సైకియాట్రిస్ట్ సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూనియర్ రెసిడెంట్ డాక్టర్ అయిన అనురాగ్ కూడా డిప్రెషన్ కి చికిత్స తీసుకుంటున్నాడు.

మనం గొప్ప విషయాలుగా భావించే తెలివితేటలు, ప్రతిభ, ఉన్నత చదువులు, కళల్లో నైపుణ్యం… ఇలాంటివన్నీ మేధస్సుకి కొలమానాలు కావచ్చు కానీ అవన్నీ మానసిక ఆరోగ్యాన్ని ఇవ్వలేవని  ఇలాంటి ఆత్మహత్యలు నిరూపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు తెలివితేటలంటే ఐక్యూ ఒక్కటే కాదు… ఈక్యూ (ఎమోషనల్ కోషెంట్) కూడా అని అందరూ నమ్ముతున్నారు.