స్విస్‌ కంపెనీ చేతికి బ్రహ్మణి స్టీల్స్‌?

కడపజిల్లా ముద్దనూరు, జమ్మలమడుగు మధ్యలో గాలి జనార్ధన్‌ రెడ్డి నిర్మించ తలపెట్టిన బ్రహ్మణి స్టీల్స్‌ అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగిన ఈ బ్రహ్మణి స్టీల్స్‌… వైఎస్‌ మరణం తరువాత అనేక రాజకీయ కారణాల వల్ల వివాదాలకు కేంద్ర బిందువైంది. ఆ తరువాత ముఖ్యమంత్రిగా వచ్చిన కిరణ్‌ కుమార్ రెడ్డి బ్రహ్మణి స్టీల్స్‌ కు గత ప్రభుత్వం ఇచ్చిన అనేక అనుమతులను రద్దు చేశాడు.

అయితే అప్పటికే గాలి జనార్ధన్‌ రెడ్డి ఆ భూమి చుట్టూతా కాంపౌండ్‌ వాల్‌ కట్టి కొన్ని సివిల్‌ వర్క్‌ లు కూడా పూర్తిచేశాడు. సుమారు 1500 కోట్లు దానిపై ఖర్చుకూడా పెట్టాడు. అయితే రాజకీయ కారణాల వల్ల అవన్నీ అలా నిలిచిపోయాయి.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ బ్రహ్మణి స్టీల్స్‌ కాంపౌండ్‌ లో మెడికల్‌ హబ్‌ను డెవలప్‌ చేయాలని గాలి జనార్ధన్‌ రెడ్డి భావించాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా స్విడ్జర్‌ లాండ్‌ లోని ప్రఖ్యాత సంస్థ ఐఎమ్‌ఆర్‌ కంపెనీ ఇక్కడ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టడానికి ముందుకొచ్చింది. స్విస్‌ కంపెనీ, గాలి జనార్ధన్‌ రెడ్డి మధ్య ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రాథమిక అవగాహన కుదిరిందని చెబుతున్నారు.

ఇందులో 51 శాతం స్విడ్జర్‌ లాండ్‌ ఐఎమ్‌ఆర్‌ కంపెనీకి, 49 శాతం జనార్ధన్‌ రెడ్డి సంస్థ తీసుకునేలా ప్రాథమిక బప్పందం కుదిరిందని అంటున్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభం అయితే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అవుతుందని, కొన్ని వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు.

ఈ బ్రహ్మణి స్టీల్స్‌ కు సంబంధించి దాదాపు అన్ని కేసులు ఇప్పటికే క్లియర్‌ అయిపోయాయి. ఏపీ ప్రభుత్వం కూడా వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులు మంజూరు చేయవచ్చని అనుకుంటున్నారు. అయితే కట్టబోయే ఫ్యాక్టరీకి బ్రహ్మణి స్టీల్స్‌ పేరును తొలగించి మరో కొత్త పేరు పెడతారని భావిస్తున్నారు.