ఈఎస్‌ఐను తేల్చిన కసిరెడ్డే ఇంటెలిజెన్స్ చీఫ్

సీనియర్ ఐపీఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నూతన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధిపతిగా ఉన్నారు. ఇకపై విజిలెన్స్ విభాగంతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన మనీశ్‌ కుమార్‌ సిన్హాకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. విశాఖ పరిపాలన రాజధానిగా ఖాయమైన నేపథ్యంలో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండడంతో మనీష్‌ కుమార్ సిన్హాను విశాఖ సీపీగా నియమించారు.

ఆర్థిక నేరాలను వెలికితీయడంతో కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈఎస్‌ఐ కుంభకోణంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది రాజేంద్రనాథ్‌ రెడ్డే. మరికొన్ని కుంభకోణాలకు సంబంధించిన నివేదికలను కూడా ఆయన ప్రభుత్వానికి అందజేశారు. విశాఖ సీపీగా బాధ్యతలు నిర్వహించిన ఆర్‌కే మీనాను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.