ఇది… మాస్క్ ఆఫ్ ది ఇయర్!

కరోనా పుణ్యమా అని… మాస్క్ మన జీవిత విధానంలో భాగమైపోయింది. ఇష్టమున్నా లేకపోయినా దాన్ని ధరించడం తప్పదని అర్థం చేసుకున్నాక… వాటిని మరింత అందంగా సౌకర్యవంతంగా మార్చుకునే ప్రయత్నాలను చేస్తున్నాం అందరం.

ఈ క్రమంలో ధరించిన షర్టుకి, టైకి మ్యాచ్ అయ్యేలాంటి మాస్క్ లను చూశాం. ఇంకా రకరకాల డిజైన్లున్నవి, బంగారంతో తయారైనవి, వజ్రాలు పొదిగినవి సైతం చూస్తున్నాం. ఇప్పుడు మరింత భిన్నంగా … ధరించిన వారి మొహం రూపమే ముద్రితమైన మాస్కులు ప్రత్యక్ష్యం అవుతున్నాయి. ఈ మాస్క్ ని చూసినవారు వీటిలోనూ ఇంత క్రియేటివిటీనా అని ఆశ్చర్యపోతున్నారు.

దేశవ్యాప్తంగా చాలా ఫొటో స్టూడియోల్లో… ఇలాంటి మాస్కులు ధరించిన వారి ఫొటోలు దర్శనమిస్తున్నాయి.  మాస్క్… మొహంలోని ఏ భాగాలను అయితే మూసేస్తుందో అవే భాగాలు…. అంటే ముక్కు, చెంపలు, నోరు, చుబుకం… ఇవన్నీ దానిపై ముద్రించి ఉంటాయి. మాస్క్ ధరించినవారి ముఖభాగమే మాస్క్ మీద ముద్రితమై ఉండటం వలన… మొహం సగం మూసుకుని పోయినట్టు కాకుండా మామూలుగానే కనిపించే అవకాశం ఉంది.

మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఇలాంటి మాస్క్ ని ధరించగా ఆయన ఫొటోలు వైరల్ గా మారాయి. నెటిజన్లు చాలామంది దీనిని మాస్క్ ఆఫ్ ది ఇయర్ గా అభివర్ణిస్తున్నారు. కరోనా పోయే లోపల ఇంకెన్ని రకాల మాస్కులు వస్తాయో… చూడాలి మరి.