Telugu Global
National

అరిగిపోయిన రికార్డులు వేస్తున్న చంద్రబాబు

ఎవరిది అభివృద్ధి, ఎవరిది విధ్వంసం.. ఇదీ చంద్రబాబు నెటిజన్లను అడిగిన ప్రశ్న. దీనికి కొనసాగింపుగా ప్రతి జిల్లాలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ అంటూ వీడియోలు బైటకు వదులుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇలాంటి జిమ్మిక్కులతోటే ప్రజల్ని మభ్యపెట్టాలని, మాయచేయాలని చూశారు చంద్రబాబు. పార్కుల్లో మొక్కలు నాటి, రోడ్ల పక్కన గోడలకు రంగులేసి (కేంద్రం ఇచ్చిన స్వచ్ఛభారత్ నిధులతో), గ్రాఫిక్స్ మేళవించి, నిధుల మాయను చూపిస్తూ చేసిన వీడియోలు అవి. అప్పట్లోనే ఈ వీడియోలకు […]

అరిగిపోయిన రికార్డులు వేస్తున్న చంద్రబాబు
X

ఎవరిది అభివృద్ధి, ఎవరిది విధ్వంసం.. ఇదీ చంద్రబాబు నెటిజన్లను అడిగిన ప్రశ్న. దీనికి కొనసాగింపుగా ప్రతి జిల్లాలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ అంటూ వీడియోలు బైటకు వదులుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇలాంటి జిమ్మిక్కులతోటే ప్రజల్ని మభ్యపెట్టాలని, మాయచేయాలని చూశారు చంద్రబాబు.

పార్కుల్లో మొక్కలు నాటి, రోడ్ల పక్కన గోడలకు రంగులేసి (కేంద్రం ఇచ్చిన స్వచ్ఛభారత్ నిధులతో), గ్రాఫిక్స్ మేళవించి, నిధుల మాయను చూపిస్తూ చేసిన వీడియోలు అవి. అప్పట్లోనే ఈ వీడియోలకు ప్రజలు మోసపోలేదు. మళ్లీ ఇప్పుడు అరిగిపోయిన రికార్డులు వేస్తే ఎందుకు నమ్ముతారు.

పోనీ చంద్రబాబు చెప్పినట్టు నిజంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ఆయన అభివృద్ధి చేశారనుకుందాం. అంత అభివృద్ధే జరిగితే.. టీడీపీకి మరీ దారుణంగా 23 సీట్లు మాత్రమే ఎందుకొస్తాయి. మంత్రి పదవిలో ఉండి పోటీ చేసిన వారంతా ఎందుకు ఘోర పరాభవాలు పొందుతారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కొడుకు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఏంటి? చావు తప్పి కన్నులొట్టబోయినట్టు చంద్రబాబుకి తన జీవితకాలంలో అతి తక్కువ మెజార్టీ రావడం ఏంటి?

ఇవన్నీ చూసి కూడా ఇంకా చంద్రబాబు తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాననే భ్రమలోనే ఉన్నారా, ప్రజల్ని కూడా ఆ భ్రమలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారా..? చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి అంతా కేవలం కాగితాలకే పరిమితం, గ్రాఫిక్స్ కే అంకితం. ఈ ఊహాజనిత అభివృద్ధిని ఆయన అనుకూల మీడియా గోరంతలు కొండంతల్ని చేసి చూపించింది. అయితే ప్రజలెవరూ ఆ మాయలో పడకపోవడం విచిత్రం.

చంద్రబాబు ఇంకా తన ఓటమికి కారణాలు తెలుసుకోకుండా ప్రజలే తప్పుడు నిర్ణయం తీసుకున్నారనే భ్రమలో ఉన్నారు. అందుకే జగన్ ఘన విజయాన్ని ఆయన తక్కువచేసి చూస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు గ్రహిస్తే మంచిదని ఆ పార్టీనేతలు, కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. అభివృద్ధి ఎవరిది? విధ్వంసం ఎవరిది? అని ప్రశ్నిస్తున్న బాబు.. స్వయం కృషి ఎవరిది? స్వయంకృతాపరాధం ఎవరిది? అని తనను తాను ప్రశ్నించుకోవాలని సలహా ఇస్తున్నారు.

First Published:  12 Aug 2020 9:51 PM GMT
Next Story