జాన్వీ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌

బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాజాగా నటించిన చిత్రం గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్. ఈ చిత్రం అగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, గుంజన్ సక్సేనా అనే ఒక మహిళా పైలెట్ కథను సినిమాగా తీశారు. ఇప్పటికే మిశ్రమ స్పందన వచ్చిన ఈ సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.

గుంజన్ సక్సేనా సినిమాలో ఆమె పాత్రను హైలైట్ చేసి ఐఏఎఫ్‌ను నెగెటివ్‌గా చిత్రీకరించడంపై అభ్యంతరం తెలుపుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది. ఐఏఎఫ్‌లో లింగ వివక్ష ఉన్నదన్నట్లు ఈ సినిమా ప్రచారం చేస్తున్నదని.. అసలు అలాంటి వివక్ష లేదని ఐఏఎఫ్‌ లేఖలో పేర్కొంది. ఈ సినిమా చిత్రీకరణకు ముందే తమను సంప్రదించిన ధర్మ ప్రొడక్షన్స్.. సినిమాలో యువ ఐఏఎఫ్ అధికారులకు స్పూర్తినిచ్చే విధంగా చిత్రీకరిస్తామని ఒప్పందం చేసుకుందని.

కానీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అసంబద్దమైన సీన్లను పెట్టిందని ఐఏఎఫ్ ఆరోపించింది. ఈ లేఖను ధర్మ ప్రొడక్షన్స్, నెట్ ఫ్లిక్స్‌కు కూడా పంపింది. సినిమాలో సీన్లను గతంలోనే తొలగించమని కోరగా.. కేవలం డిస్‌క్లెయిమర్ మాత్రమే వేసి చేతులు దులుపుకుందని లేఖలో పేర్కొంది.