విశ్వాస పరీక్ష నెగ్గిన సీఎం గెహ్లోత్

రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. గత కొన్ని రోజులుగా అనేక మలుపులు తిరిగిన రాజస్థాన్ రాజకీయాలు శుక్రవారం సుఖాంతమయ్యాయి. బీజేపీ వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ విశ్వాస పరీక్షలో సీఎం అశోక్ గెహ్లోత్ విజయం సాధించారు. మూజువాణి ఓటు ద్వారా అశోక్ గెహ్లోత్ ప్రభుత్వానికి అనుకూలంగా 125 మంది సభ్యులు మద్దతు తెలపడంతో ఆయన ప్రభుత్వం గట్టెక్కింది. అనంతరం సభను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ ప్రకటించారు.

నెల రోజుల పాటు సాగిన తిరుగుబాటు, బుజ్జగింపులు, ఫిరాయింపులు, ప్రలోభాల వాదనలకు తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకల జోక్యంతో తిరుగుబాటు విరమించుకున్న సచిన్ పైలట్ రాజస్థాన్ చేరుకుని అశోక్ గెహ్లోత్‌కు మద్దతు తెలపడానికి అంగీకరించారు. గురువారమే సచిన్ వర్గపు 19 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంతకు ముందు ఇద్దరిపై వేసిన సస్పెన్షన్ వేటును కూడా సీఎం గెహ్లోత్ తొలగించారు.

శుక్రవారం సభ ప్రారంభం అవగానే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శాంతి కుమార్ దరివాల్ విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ అంతర్గత కలహాలు కళ్ల ముందే కనిపించినా బీజేపీపై నిందలు వేశారని, సర్కారు ఫోన్ ట్యాపింగులకు పాల్పడిందని, రాష్ట్ర పోలీసులను సొంత పనులకు వాడుకున్నారని బీజేపీ ఆరోపించింది.

అసెంబ్లీ సమావేశానికి ముందు రాజస్తాన్ ప్రజలే గెలుస్తారని ట్వీట్ చేసిన సీఎం విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేసినవారందరికీ గుణపాఠమని, వారి కుతంత్రాలన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో చేసిన కుయుక్తులనే రాజస్తాన్‌లోనూ అమలు చేశారని, కానీ, ఇక్కడ వారి కుట్రలు పారలేదని తెలిపారు.

ఇక సచిన్ పైలెట్ డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవడంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా మిగిలారు. దీంతో ఆయన సాధారణ ట్రెజరీ బెంచీల్లో కాకుండా వెనుక బెంచీలకు మారాల్సి వచ్చింది. సచిన్ శుక్రవారం సభలో అడుగుపెట్టగానే ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద పెట్టున విమర్శలు గుప్పిస్తూ నినాదాలు చేశారు. దీనికి పైలెట్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తనను వెనుక బెంచీలకు, ప్రతిపక్షాలకు దగ్గరగా మార్చడానికి కారణం.. బార్డర్‌లో గట్టి కాపలా ఉండాలనే అని అన్నారు. ఒక ధీటైన సైనికుడు ప్రతిపక్షాల నుంచి కాపాడటం కోసమే ఇక్కడ కూర్చోబెట్టారని చెప్పి ప్రతిపక్షాల నోరు మూయించారు.