Telugu Global
National

కేసీఆర్ కల నిజమైతే.... దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమే

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కి నీటి పారుదలపై అవగాహన ఎక్కువ, మక్కువ కూడా. ఇంజనీరింగ్ నిపుణుడి తరహాలో ఆయన ఆలోచనలు ఉంటాయి. అందువల్లనే కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే పెద్దదైన బహుళ ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ళలో పూర్తిచేశారు. అదే విధంగా దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్ట్ లను కూడా ఆయన చిత్తశుద్ధితో పూర్తిచేయగలరని… అదే జరిగితే రాయలసీమ ఎత్తపోతల పథకం వల్ల దక్షిణ తెలంగాణ కు ఏమాత్రం అన్యాయం జరిగే పరిస్థితే రాదని జల నిపుణులు […]

కేసీఆర్ కల నిజమైతే.... దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమే
X

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కి నీటి పారుదలపై అవగాహన ఎక్కువ, మక్కువ కూడా. ఇంజనీరింగ్ నిపుణుడి తరహాలో ఆయన ఆలోచనలు ఉంటాయి. అందువల్లనే కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే పెద్దదైన బహుళ ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ళలో పూర్తిచేశారు. అదే విధంగా దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్ట్ లను కూడా ఆయన చిత్తశుద్ధితో పూర్తిచేయగలరని… అదే జరిగితే రాయలసీమ ఎత్తపోతల పథకం వల్ల దక్షిణ తెలంగాణ కు ఏమాత్రం అన్యాయం జరిగే పరిస్థితే రాదని జల నిపుణులు విశ్లేషిస్తున్నారు.

డిండి ఎత్తిపోతల పథకం 30 టిఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ఇది పూర్తయితే 3.42 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. అదే విధంగా దిగువన కృష్ణా జలాల ఆధారంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని నల్గొండ జిల్లా ప్రయోజనం కోసం చేపట్టారు. ఈ పథకం ద్వారా లక్ష ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుంది.

తెలంగాణలో నిర్మాణంలో ఉన్న కృష్ణా ఆధారిత వరదనీటి వినియోగ, కేటాయింపులు ఉన్న ప్రాజెక్ట్ లను త్వరితగతిన పూర్తిచేయడం ద్వారా దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది.

కేసీఆర్ అనుకున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ సాకారం అయితే ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు, బీజేపీకి గడ్డు పరిస్థితే. అందువల్లే సాగు నీటి ప్రాజెక్టుల మీద అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభించి ఎన్నో ఏళ్ళు గడిచినా కొన్ని తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయలేని కాంగ్రెస్ వాళ్ళు కూడా నీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ను విమర్శించడం ఆశ్చర్యకరమే.

ఆంధ్రప్రదేశ్ లో సంగమేశ్వరం, రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా తెలంగాణకు ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి ఆందోళనలో నిజం లేదు. ఎందుకంటే ఏపి వైపు వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు పూర్తయినప్పటికీ, శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల సరాసరి నీరు ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. కానీ తెలంగాణలో నిర్మాణంలో ఉన్న, పూర్తయిన ప్రాజెక్ట్ లు శ్రీశైలంలో నీటి మట్టం కనీస స్థాయికి పడిపోయినప్పుడు కూడా పంపింగ్ చేయడం సాధ్యమవుతుంది. అందువల్ల రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు ఏమాత్రం నష్టం లేదనేది నిపుణుల విశ్లేషణ. పైగా కేంద్ర జల మంత్రిత్వ శాఖ అధీనంలోనే ఉన్న కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ వాటర్ బోర్డు పర్యవేక్షణలో నీటి వినియోగాన్ని అమలు చేయాలి.

అయితే తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు ఏళ్ళ తరబడి నత్తనడకన నడుస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ 1983లో ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పూర్తి కానేలేదు. నాగార్జున సాగర్ ఎగువ భాగం నుంచి ఈ ప్రాజెక్ట్ కు నీరు తీసుకుంటుండగా కొత్తగా శ్రీశైలం నుంచి కూడా ప్రాజెక్ట్ కు నీరు తీసుకునే విధంగా నిర్మాణ పనులు చేపట్టారు.

మరో ప్రధానమైన ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి. ఈ ప్రాజెక్ట్ లో 5 ఎత్తిపోతల కేంద్రాలతో పాటు 6 జలాశయాలు నిర్మించాలి. దీని వల్ల మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. అయితే ఈ పనులు అప్పగించి ఐదేళ్ళు గడిచిపోయినా నత్తనడకన జరుగుతున్నాయి. మొత్తం 21 ప్యాకేజీలుగా పనులు విభజించినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు జరుగుతున్నాయి. ప్రధానంగా నిధుల కొరత వల్లనే ఈ పరిస్థితి ఎదురయ్యింది. అదే విధంగా డిండి ఎత్తిపోతల పథకం కూడా.

కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోథల, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్ట్ లు నిర్మాణం, వినియోగంలో ఉన్నాయి. వీటిల్లో శ్రీశైలం ఎడమగట్టు కాలువ మూడు దశాబ్దాల క్రితం చేపట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదు. నిర్మాణంలో ఉంది. 40 టిఎంసీల నీటిని వినియోగించుకోవడం ద్వారా 4 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావచ్చు. పాలమూరు రంగారెడ్డి పథకం ద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. 90 టిఎంసీల నీటిని వినియోగించుకోవడం ద్వారా 12.30 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావచ్చు.

భవిష్యత్తులో కృష్ణా జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆధారంగా రెండు తెలుగు రాష్ర్టాలు సద్వినియోగం చేసుకునే విధంగా కొత్త ప్రాజెక్ట్ లు నిర్మించడం ద్వారానే నీటి వృధాని అరికట్టి వెనుకబడిన దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  14 Aug 2020 3:35 AM GMT
Next Story