రెండు పడవలపై పవన్ ప్రయాణం… సాగేనా..? ఆగేనా..?

సినిమాల్లో పవన్ కల్యాణ్ ని చూసి అభిమానించిన ప్రేక్షకులే.. పార్టీ పెట్టిన తర్వాత జనసైనికులుగా మారారు. అంతమాత్రాన పవర్ స్టార్ అభిమానులంతా జనసేన కార్యకర్తలు అని చెప్పలేం. జనసేనలో ఉన్నవాళ్లందరికీ పవన్ కల్యాణ్ మాత్రమే ఆరాధ్య నటుడు అని చెప్పలేం.

గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్లా పవన్ ఓడిపోయిన సందర్భంలో అటు అభిమానులు, ఇటు కార్యకర్తలు అందరూ తీవ్ర నిరాశపడ్డారు. ఆ వెంటనే పాతికేళ్ల ప్రస్థానాన్ని నేను ఆపబోనంటూ ధైర్య వచనాలు చెప్పడంతో జనసేన కార్యకర్తల్లో కాస్త సంతోషం నెలకొంది.

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనే ఉంటారు, ముందుండి తమను నడిపిస్తారని ఆశపడ్డారు. ఆ కొన్నాళ్లకే పవన్ మనసు మారింది. ఆర్థిక కారణాల పేరు చెప్పి ఆయన మళ్లీ మొహానికి రంగులేసుకున్నారు. అసలు తాను సినిమా చేస్తున్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించడానికే చాలా రోజులు ఇబ్బంది పడ్డారు కూడా.

రాజకీయాలకే ఫిక్స్ అయిపోతారనుకున్న తమ అభిమాన నటుడు ఎలాగోలా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వగానే ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఒకటి కాదు రెండు సినిమాలను ఒకే దఫా మొదలు పెట్టి షూటింగ్ లకు హాజరవుతున్నారని తెలియగానే మరింత సంతోష పడ్డారు. ఇప్పుడు ఆ ఆనందం ద్విగుణం.. బహుళం అయిపోతోంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాతోపాటు.. క్రిష్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా చేస్తున్న పవన్ వాటి తర్వాత, హరీష్ శంకర్ తో మరో సినిమా చేస్తారు. ఇక నాలుగో సినిమా కూడా ఇటీవలే కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరి అనే నిర్మాతకు పవన్ డేట్స్ ఇచ్చారట. డైరెక్టర్ ఎవరు, కథ ఏంటి, స్ట్రైట్ సినిమానా, రీమేకా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మొత్తానికి పవన్ రీఎంట్రీ తర్వాత వరుసగా నాలుగు సినిమాలు కమిట్ కావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రాజకీయాల్లో రాణించలేకపోయినా సినిమాల్లో ఆయన ఎప్పుడూ పవర్ స్టారేనంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

మరోవైపు సీరియస్ గా జనసేనకోసం పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలు మాత్రం మరోసారి నిరాశలో మునిగిపోయారు. పవన్ కల్యాణ్ వ్యవహారం అంతా చాలా విచిత్రంగా ఉంటుంది. పొత్తుల విషయంలో కూడా కాసేపు ఆ పార్టీ అంటారు, కాసేపు ఈ పార్టీ అంటారు. పవన్ తో పొత్తు పెట్టుకున్నవాళ్లు లాభపడుతున్నారు కానీ, ఆయన మాత్రం ఎదగలేక పోతున్నారు. ఇలాంటి దశలో పవన్ రెండు పడవల ప్రయాణం ఎంతవరకు సమంజసం అంటున్నారు జనసేన కార్యకర్తలు. ఇలా సినిమా తర్వాత సినిమా ఒప్పుకుంటూ పోతే.. వచ్చే ఎన్నికలనాటికి జనసేనను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయగలరా లేదా అనేది వారి అనుమానం.