నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను శనివారం ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతీ భారతీయుడికి ఒక యూనీక్ ఐడీ క్రియేట్ చేసి ఇస్తారు. పూర్తి టెక్నాలజీ ఆధారితంగా పని చేసే ఈ స్కీంలో ప్రతీ భారతీయుడి సమగ్ర వైద్య సమాచారం ఉంటుంది. ఈ ఐడీ చెబితే క్షణాల్లో ఆ సమాచారం లభిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలకనుంది.

దేశంలో ప్రతీ ఒక్కరికి ఒక హెల్త్ కార్డ్ అందిస్తారు. దానిపై ఆ ఐడీ ముద్రించబడి ఉంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లినా, ఫార్మసీకి వెళ్లినా ఆ ఐడీని చూపించాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు నమోదు చేయబడి ఉంటుంది. ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పరిధిలోకి తీసుకొని వచ్చారు.

మరోవైపు ఈ ఆరోగ్య సమాచారం దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వైద్యులు, హెల్త్ ప్రొవైడర్లు ఒక్కసారి మాత్రమే రోగి వివరాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కార్డు ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు టెలీ మెడిసిన్ అందిస్తారు. అంతే కాకుండా మనకు ఈ-ఫార్మసీ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి.

ఇకపై ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలు పొందాలంటే ఈ హెల్త్ కార్డ్ తప్పనిసరి చేయనున్నారు.