త్వరలోనే పరిపాలన, న్యాయ రాజధానులకు పునాది వేస్తాం – సీఎం జగన్‌

ప్రజాస్వామ్యబద్దంగా వ్యవస్థలు నడిస్తేనే ప్రజలకు, సమాజానికి మంచి జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన సీఎం… పేదల పిల్లలకు ఇంగ్లీష్ విద్య అందించకుండా, వెనుకబడిన వర్గాలకు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులు ఇవ్వకుండా, జౌట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు అవకాశం ఇవ్వకుండా, వాటిలో సగం వాటా మహిళలకు ఇవ్వకుండా, అభివృద్ది వికేంద్రీకరణ చేయకుండా సమన్యాయం సాధ్యం కాదన్నారు.

అంటరానితనం నేరం అని తెలిసినా కొందరు నాయకులు మాత్రం విద్యాపరమైన అంటరానితనాన్ని కొనసాగించాలని పట్టుపడుతున్నారన్నారు. వారి పిల్లలు మాత్రమే ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలి … పేదలు, వెనుకబడిన వర్గాల పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియంలో చదవకూడదు అన్న వాదన ద్వారా రూపం మార్చుకున్న అంటరానితనం స్పష్టంగా కనిపిస్తుందని ప్రతిపక్షాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి విమర్శించారు. భవిష్యత్తుల్లో పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడేలా విద్యావిధానంలో మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.

సంక్షేమపథకాల్లో పేదరికమే ప్రాతిపదికన అమలు చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2022 ఖరీఫ్ నాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామన్నారు. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీలపై ఆధారపడి లేనందున ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేకపోయినా… కేంద్రంలో పరిస్థితులు మారి హోదా వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన గాయం మానాలన్నా… మరోసారి అలాంటి గాయాలు తగలకుండా ఉండాలన్నా.. మూడు ప్రాంతాల్లో సమన్యాయం జరగాలన్నారు. అందుకే మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చామన్నారు. త్వరలోనే పరిపాలన రాజధానికి విశాఖలో, న్యాయ రాజధానికి కర్నూలులో పునాదులు వేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి. తాము తెస్తున్న పథకాలు ఎన్నికల కోసం తెస్తున్నవి కావని సీఎం చెప్పారు.