Telugu Global
National

నాడు-నేడుతో సీఎం జగన్ కి తిరుగులేని ఇమేజ్...

స్వాతంత్రం వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలేనన్ని ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాయి. కొన్నిటివల్ల ప్రజలకు నిజంగానే ఉపయోగం, మరికొన్ని పాలకుల జేబులు నింపేందుకు, ఇంకొన్ని కేవలం ఎన్నికల ముందు ఓట్లు రాల్చేందుకు మాత్రమే పనికొచ్చాయి. అతికొద్ది పథకాలు మాత్రమే తరతరాలు చెప్పుకోడానికి పనికొస్తాయి. గతంలో వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ ఆ కోవలోనిదే. రాజీవ్ ఆరోగ్యశ్రీ అని, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని.. పేర్లు మారొచ్చు కానీ.. ఏ పేరు విన్నా గుర్తొచ్చేది […]

నాడు-నేడుతో సీఎం జగన్ కి తిరుగులేని ఇమేజ్...
X

స్వాతంత్రం వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలేనన్ని ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాయి. కొన్నిటివల్ల ప్రజలకు నిజంగానే ఉపయోగం, మరికొన్ని పాలకుల జేబులు నింపేందుకు, ఇంకొన్ని కేవలం ఎన్నికల ముందు ఓట్లు రాల్చేందుకు మాత్రమే పనికొచ్చాయి. అతికొద్ది పథకాలు మాత్రమే తరతరాలు చెప్పుకోడానికి పనికొస్తాయి.

గతంలో వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ ఆ కోవలోనిదే. రాజీవ్ ఆరోగ్యశ్రీ అని, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని.. పేర్లు మారొచ్చు కానీ.. ఏ పేరు విన్నా గుర్తొచ్చేది మాత్రం వైఎస్సారే. ఇప్పుడు జగన్ జమానాలో.. నాడు-నేడు పథకాన్ని ఆ జాబితాలో చేర్చొచ్చు. వేసవి సెలవలకు కరోనా సెలవలు పరోక్షంగా కలసి రావడంతో.. పల్లెల్లో పాఠశాలలు కొత్త రూపు సంతరించుకున్నాయి.

నాడు-నేడు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం కేటాయింపులు అక్షరాలా 12,000 కోట్ల రూపాయలు. మొత్తం మూడు దశలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా తొలి దశలో 3,500 కోట్ల రూపాయలతో 15,715 పాఠశాలల రూపు రేఖలు మార్చేశారు.

రెండో దశలో 14,584 స్కూల్స్ లో 4,732 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

ఇక మూడోదశలో 16,489 స్కూల్స్ లో 2,969 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి 2022కల్లా సర్కారు స్కూల్స్ అన్నిటినీ కార్పొరేట్ తరహా లుక్ లోకి మార్చబోతున్నారు.

మిగతా పథకాలకు కేటాయింపులు పేపర్లో కనిపిస్తాయి కానీ.. నాడు-నేడు మాత్రం ప్రజలకు కళ్లముందు కనపడుతోంది. ఇప్పటికే తమ తమ ప్రాంతాల్లో పాఠశాలలు ఎలా ఉన్నాయనే విషయాన్ని అప్పుడు-ఇప్పుడు అంటూ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు ఉపాధ్యాయులు.

వృత్తిలో భాగంగా వారు ఆ పనిచేస్తుండొచ్చు కానీ, గ్రామస్తులు కూడా తమ ఊరి స్కూల్ ఫొటోలను విపరీతంగా ప్రచారం చేసుకోవడమే ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఊరికి దూరంగా, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న చాలామంది తమ సొంత ఊరిలో తాము చదువుకున్న పాత పాఠశాలలన్నీ కొత్త రూపు సంతరించుకోవడంతో సంతోషపడుతున్నారు. ఇది ఒక్కరు, ఇద్దరికి సంబంధించిన విషయం కాదు, ఊరు ఊరంతా సంబరపడే విషయం.

ఇక ఇక్కడ సర్కారుబడి నడవడం కష్టం అని చేతులెత్తేసిన దశలో జగన్ నాడు-నేడు కార్యక్రమంతో ఆయా పాఠశాలలకు మహర్దశ పట్టింది. సెప్టెంబర్5న స్కూల్స్ తిరిగి ప్రారంభం అయితే ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరిగితే అప్పుడు జగన్ చేపట్టిన కార్యక్రమానికి ఫలితం దక్కుతుంది.

ఇప్పటి వరకూ చాలామంది పాలకులు ప్రభుత్వస్కూళ్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేశారు కానీ తొలిసారిగా వైఎస్ జగన్ పని మొదలు పెట్టారు. జగన్ ప్రవేశ పెట్టిన మిగతా పథకాలన్నిటిపై ఒకటీ అరా విమర్శలు వచ్చాయి కానీ.. నాడు-నేడుని మాత్రం పార్టీలకతీతంగా ప్రజలంతా స్వాగతిస్తున్నారు.

First Published:  15 Aug 2020 8:35 PM GMT
Next Story