Telugu Global
National

ఇళ్లపట్టాల పంపిణీకి చంద్రబాబు మరో అడ్డంకి...

నవరత్నాల అమలులో ఇళ్ల పట్టాల పంపిణీ మినహా మిగతా అన్నిటినీ జగన్ ఏడాది పాలనలోనే పూర్తి చేశారు. అయితే పేదలకు అత్యధిక లబ్ధి చేకూర్చే ఇళ్ల స్థలాల కేటాయింపుకి మాత్రం అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష, పరోక్ష కారణం చంద్రబాబు. లేనిపోని వివాదాలు సృష్టించి, కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డు తగులుతున్నారు బాబు. దాదాపు 30లక్షలమంది లబ్ధిదారులకు అందాల్సిన ఇళ్ల స్థలాల పట్టాలు చేతికి అందినట్టే అంది వెనక్కి పోతున్నాయి. […]

ఇళ్లపట్టాల పంపిణీకి చంద్రబాబు మరో అడ్డంకి...
X

నవరత్నాల అమలులో ఇళ్ల పట్టాల పంపిణీ మినహా మిగతా అన్నిటినీ జగన్ ఏడాది పాలనలోనే పూర్తి చేశారు. అయితే పేదలకు అత్యధిక లబ్ధి చేకూర్చే ఇళ్ల స్థలాల కేటాయింపుకి మాత్రం అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష, పరోక్ష కారణం చంద్రబాబు.

లేనిపోని వివాదాలు సృష్టించి, కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డు తగులుతున్నారు బాబు. దాదాపు 30లక్షలమంది లబ్ధిదారులకు అందాల్సిన ఇళ్ల స్థలాల పట్టాలు చేతికి అందినట్టే అంది వెనక్కి పోతున్నాయి.

మార్చి 25నుంచి ఏప్రిల్ 14కు, ఆ తర్వాత జులై 8కి, ఇటీవల ఆగస్ట్ 15కు, తాజాగా.. అక్టోబర్ 2కి ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా దీనికి మరో అడ్డంకి సృష్టించాలనుకుంటున్నారు చంద్రబాబు. భూ సేకరణలో అవినీతి జరుగుతోందంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఆవ భూముల్లోనే 500 కోట్ల అవినీతి జరిగిందని అంటున్న బాబు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5వేల కోట్ల అవినీతి జరిగి ఉంటుందని ఊహాగానాలు వ్యక్తం చేశారు.

అయితే గత బడ్జెట్ లో ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించిన మొత్తం నిధులు 3,691 కోట్ల రూపాయలు. మరి చంద్రబాబు చెప్పినట్టు బడ్జెట్ లో కేటాయించిన నిధులకంటే ఎక్కువ అవినీతి జరిగితే.. ఆ సొమ్ము ఎవరి జేబులోనుంచి తెచ్చి ఉండాలి. ఆమాత్రం లాజిక్ లేకుడా కేవలం విమర్శలకే పదునుపెట్టి చంద్రబాబు ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడాలని చూస్తున్నారు.

ఇప్పటికే పలు వాయిదాలతో విసిగిపోయిన సీఎం జగన్.. ఇళ్ల పట్టాల పంపిణీకోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోబోతున్నట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను నేరుగా ఇవ్వకపోయినా పర్వాలేదు, పేదలకు న్యాయం జరిగితే చాలు అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు చెబుతున్నారు. అంటే తొలి దశలో నేరుగా పట్టాలివ్వకపోయినా, స్థలాల కేటాయింపులు పూర్తి చేసి, కోర్టు అనుమతులు వచ్చాక పట్టాల పంపిణీ జరుగుతుందనమాట.

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు చూచాయగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రబాబు అడ్డంకులు సృష్టించడం వల్లే ఈ కార్యక్రమం ఆలస్యమవుతోందనే విషయాన్ని కూడా వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నారు.

ఐదేళ్ల కాలంలో తాము నిర్మించిన అపార్ట్ మెంట్లను ప్రజలకు అందుబాటులోకి తేలేకపోవడం చంద్రబాబు అసమర్థత అయితే.. ఇప్పుడు జగన్ హయాంలో ఏడాదిగా ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడం.. ఆ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలేనని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.

First Published:  20 Aug 2020 11:18 PM GMT
Next Story