ప్రభాస్ కు విలన్ దొరికేశాడు

ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే పాన్ ఇండియా సినిమా ప్రకటించిన వెంటనే బాలీవుడ్ లో వరుసగా కథనాలు మొదలయ్యాయి. రామాయణం ఆధారంగా ఈ సినిమా రాబోతోందనే విషయాన్ని బాలీవుడ్ మీడియానే బ్రేక్ చేసింది. అంతేకాదు, ఈ భారీ ప్రాజెక్టులో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించబోతున్నాడనే విషయాన్ని కూడా బాలీవుడ్డే చెప్పింది. ఇప్పుడీ సినిమాలో విలన్ ఎవరనే విషయం కూడా అక్కడ్నుంచే బయటకొచ్చింది.

బాలీవుడ్ కథనాల ప్రకారం.. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కు విలన్ గా సైఫ్ అలీఖాన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్, సైఫ్ తో చర్చలు ప్రారంభించాడనేది బాలీవుడ్ మీడియా సారాంశం. ఆదిపురుష్ లో సైఫ్, రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో టీ-సిరీస్ బ్యానర్ పై రాబోతోంది ఆదిపురుష్. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి, 2022లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఈ సినిమాను తెలుగు-హిందీ భాషల్లో త్రీడీలో నిర్మిస్తారు. మలయాళ, కన్నడ, తమిళ భాషలతో పాటు మరో 12 భాషల్లో సినిమాను అనువదిస్తారు.