143 మంది అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు… లిస్ట్‌లో ప్రముఖులు

హైదరాబాద్‌లో ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు సంచలనంగా ఉంది. తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి పేర్లను కూడా యువతి ఫిర్యాదులో ఇచ్చారు. దాంతో 42పేజీలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది.

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన యువతికి మైనర్‌గా ఉండగానే 2009లో మిర్యాలగూడకు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకున్నయువతి తిరిగి చదువు కొనసాగించింది. అలా చదువుకుంటున్న సమయంలో పరిచయం అయిన విద్యార్థి సంఘం నాయకుడు ఒకరు తొలుత తనపై అత్యాచారం చేశాడని… నగ్న వీడియోలు తీసి బెదిరించాడని ఫిర్యాదులో వివరించింది.

వాటి సాయంతో అతడితో పాటు గడిచిన 11 ఏళ్లలో 143 మంది తనపై దారుణానికి ఒడిగట్టారని ఫిర్యాదులో వివరించింది. ఈమె ఇచ్చిన ఫిర్యాదులో అనేక మంది నటులు, టీవీ యాంకర్లు, ప్రముఖుల పీఏల పేర్లు కూడా ఉన్నాయి. తనపై 143 మంది వేలసార్లు లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదులో 25ఏళ్ల యువతి వెల్లడించింది. ఆమె ఫిర్యాదును తీసుకున్న పోలీసులు నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు.