ఆ వేగంలో ఇండియా టాప్ !

భారత్ లో కరోనా కేసులు 30 లక్షలు దాటిపోయాయి. ఇప్పుడు ఈ స్థాయిలో కేసులు ఉన్నది అమెరికా, బ్రెజిల్ దేశాల్లో మాత్రమే. కరోనా వ్యాపిస్తున్న వేగం కూడా భారత్ లో చాలా ఎక్కువగా ఉంది. మొదటి కేసు నమోదు అయిన తరువాత 169 రోజులకు కరోనా కేసులు పదిలక్షలు దాటాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల కంటే ఎక్కువ కాలం ఇది. అయితే ఇరవై లక్షలకు, ముప్పయి లక్షలకు చేరడానికి మాత్రం అమెరికా బ్రెజిల్ లతో పోలిస్తే  తక్కువ సమయం పట్టింది. అంటే ఆ రెండు దేశాల్లో కంటే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.

ఇరవై నుండి ముప్పయి లక్షలకు చేరడానికి అమెరికాకు 28 రోజులు, బ్రెజిల్ కి 23 రోజులు పట్టగా మనకు కేవలం రెండువారాల సమయం మాత్రమే పట్టింది. ఆ రెండుదేశాలకంటే ఇన్ ఫెక్షన్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతుండటమే కాక… అసలేమాత్రం తగ్గుముఖం పట్టిన సూచనలు  కనిపించడం లేదు.

మనదేశంలో మొదటి పదిలక్షల కేసుల్లో సగం మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇంకా అదే పెరుగుదల కనబడుతుండగా ఢిల్లీ, తమిళనాడులో కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.

పదినుండి ఇరవై లక్షలకు చేరుకునే దశలో ఆంధ్రప్రదేశ్ లో కేసులు గణనీయంగా పెరిగాయి. ఇక ఇరవై నుండి ముప్పయి లక్షలకు చేరుకున్న క్రమంలో ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లలో ఎక్కువ కేసులు కనబడుతున్నాయి.

కరోనా నిర్దారణ పరీక్షల విషయానికి వస్తే… 35మిలియన్ల (3.5 కోట్లు) టెస్టులతో ఇండియా రష్యాను అధిగమించింది. అయితే మనదేశ జనాభాని బట్టి చూస్తే ఈ సంఖ్య తక్కువేనని చెప్పాలి. కరోనా తీవ్రంగా ఉన్నదేశాల్లో ఒకటైన  మెక్సికో కూడా అతి తక్కువ టెస్టులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.

మనదేశంలో కరోనా పరీక్షలను మొదట్లో చాలా తక్కువ స్థాయిలో నిర్వహించారు. మొదటి కేసు నిర్దారణ తరువాత ఆరునెలలకు కోటి పరీక్షలు పూర్తి చేశారు. ఆ తరువాత టెస్టుల వేగం పెంచారు. ఇటీవల రెండువారాల్లోనే కోటి పరీక్షలను నిర్వహించారు.