Telugu Global
National

ఏడుగురు సీఎంలతో సోనియా మీటింగ్... ఉమ్మడి పోరుకు నిర్ణయం

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ… ఏడుగురు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సోనియాల ఆధ్వర్యంలో ఈ కాన్పరెన్స్ జరిగింది. ఇందులో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు నలుగురు పాల్గొన్నారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కరోనా నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్‌ వాయిదాకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించారు. అవసరమైతే సుప్రీంకోర్టును […]

ఏడుగురు సీఎంలతో సోనియా మీటింగ్... ఉమ్మడి పోరుకు నిర్ణయం
X

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ… ఏడుగురు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సోనియాల ఆధ్వర్యంలో ఈ కాన్పరెన్స్ జరిగింది. ఇందులో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు నలుగురు పాల్గొన్నారు.

దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కరోనా నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్‌ వాయిదాకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారని నిర్ణయానికి వచ్చారు.

కేంద్రానికి భయపడదామా లేదా పోరాడుదామా అనేది మనమే నిర్ణయించుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. మహారాష్ట్ర కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్నదని వివరించారు. స్కూళ్లు మాత్రం ఇప్పుడే తెరువబోమని ప్రకటించారు. అమెరికాలో స్కూళ్లు తెరిచిన తర్వాత 97,000 మంది పిల్లలు కరోనా బారినపడ్డారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి మహాలో రానివ్వబోమన్నారు.

నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తే దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదలకు దారితీస్తుందని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు. గత నాలుగు నెలలుగా జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం చెల్లించలేదని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదన్నారు.

కేంద్రం తన నిర్ణయాలతో రాష్ట్రాలను భ్రష్టుపట్టిస్తోందని మమతా బెనర్జీ మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదన్నారామె. పరీక్షల వాయిదాపై సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు ప్రధాని మోదీ, రాష్ట్రపతిని కలుద్దామని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రతిపాదించగా అందుకు మమతా బెనర్జీ అంగీకరించారు.

కేంద్రం జీఎస్‌టీ నిధులు చెల్లించకపోవడంతో తమ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని పంజాబ్ సీఎం అమరీందర్‌ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకముందు సమస్యలపై ఉమ్మడిగా గళమెత్తాలని సమావేశంలో నిర్ణయించారు.

First Published:  26 Aug 2020 8:36 PM GMT
Next Story