దేశంలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు తప్పనిసరి – దువ్వూరి సుబ్బారావు

దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. పేరుకుపోతున్న మొండిబకాయిలపైనా ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మొండి బాకీలు బ్యాంకుల వద్ద భారీగా పేరుకుపోతాయని విశ్లేషించారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.

ఈ బ్యాడ్ బ్యాంకు ప్రయోగం చాలా దేశాల్లో విజయవంతమైందని గుర్తు చేశారు. అన్ని బ్యాంకుల వద్ద ఉన్న మొండి బకాయిల ఖాతాలను… కొత్తగా ఏర్పాటు చేసే బ్యాడ్ బ్యాంకుకు బదలాయించి పరిష్కరించాలని సూచించారు.

సాధారణ బ్యాంకులతో పోలిస్తే బ్యాడ్ బ్యాంకుల వల్ల మొండి బకాయిల వసూలు, పరిష్కారం విషయంలో చాలా మంచి ఫలితాలిస్తుందని అభిప్రాయపడ్డారు. మన దేశంలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు చేయాల్సిన అవసరం రాబోదని గతంలో తాను భావించానని… కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు అవసరం అనిపిస్తోందన్నారు.

ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకులపై 8.5 శాతం మొండి బకాయిల భారం ఉంది… కరోనా నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి ఆ భారం 12.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని బ్యాంకులు తమ అవసరాలకు అవసరమైన పెట్టుబడిని ఎలా సమకూర్చుకుంటాయన్నది కూడా పెద్ద సవాలేనని దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యానించారు.