Telugu Global
International

పూణేలో ప్రారంభమైన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్

కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొని రావడానికి పరిశోధనలు చేస్తున్న సంస్థల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఒకటి. దీనికి సంబంధించిన రెండో దశ ట్రయల్స్ పూణేలోని భారతి విద్యాపీఠ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఇద్దరు వాలంటీర్లకు టీకా వేశారు. ఈ టీకాలను పూణేకే చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మొదటి డోసు అందుకున్న ఇద్దరు వాలంటీర్ల ఆరోగ్యాలు బాగున్నాయని, వారి శరీర పని తీరు కూడా ఆశాజనకంగా ఉన్నట్లు వైద్యులు […]

పూణేలో ప్రారంభమైన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్
X

కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొని రావడానికి పరిశోధనలు చేస్తున్న సంస్థల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఒకటి. దీనికి సంబంధించిన రెండో దశ ట్రయల్స్ పూణేలోని భారతి విద్యాపీఠ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఇద్దరు వాలంటీర్లకు టీకా వేశారు.

ఈ టీకాలను పూణేకే చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మొదటి డోసు అందుకున్న ఇద్దరు వాలంటీర్ల ఆరోగ్యాలు బాగున్నాయని, వారి శరీర పని తీరు కూడా ఆశాజనకంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను సీరమ్ సంస్థ ‘కొవిషీల్డ్’ పేరుతో తయారు చేస్తున్నది. 32, 48 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులకు తొలి డోసు వేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు వ్యాక్సిన్ వేసి అర గంట సేపు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వారిలో వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. జ్వరం రావడం, నొప్పి లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఎదురు కాలేదు. దీంతో వారిని 1.30 గంటలకు ఇంటికి పంపించి వేసినట్లు ఆసుపత్రి వైద్యులు చెప్పారు.

‘డాక్టర్లు ఇద్దరి వాలంటీర్లకు 0.5 ఎంఎల్ కొవిషీల్డ్ డోసును ఇచ్చారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందే వారికి కరోనా-19, యాంటీ బాడీ టెస్టులు చేశాం. దానిలో నెగెటివ్ ఫలితం వచ్చింది. అలాగే వారి శరీర ఉష్ణోగ్రత, బీపీ, హార్ట్ బీట్ వంటివి ముందుగానే పరిశీలించాం. ఆ తర్వాత వ్యాక్సిన్ అందించాం’ అని వైద్య కళాశాల, ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ సంజయ్ లాల్వానీ అన్నారు. 28 రోజుల అనంతరం వీరిద్దరికీ రెండో డోసు ఇస్తారు. అనంతరం ఆరు నెలల తర్వాత ఇద్దరికీ పరీక్షలు నిర్వహిస్తారు. ఆరు నెలల తర్వాత వచ్చే ఫలితాలను బట్టే వ్యాక్సిన్ ఏ మేరకు పని చేస్తుందనే విషయం కచ్చితంగా తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాక్సిన్ ట్రయల్ కోసం ఐదుగురు వాలంటీర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో ముగ్గురిలో యాంటీ బాడీ టెస్టు రిజల్డ్ పాజిటివ్ వచ్చింది. అంటే వారికి కరోనా వచ్చి తగ్గిపోవడంతో శరీరంలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయి. అందుకే మిగతా ఇద్దరిని మాత్రమే రెండో దశ ట్రయల్స్‌కు ఎంపిక చేశారు. రాబోయే వారంలో 25 మంది వాలంటీర్లతో వాక్సిన్ ట్రయల్స్ ప్రారంభిస్తామని డాక్టర్ లాల్వానీ స్పష్టం చేశారు.

32 ఏళ్ల వాలంటీర్ ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తారు. ఆయన భారతీ ఆసుపత్రిలో ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వాలంటీర్‌గా ఉండటానికి ఆసక్తి చూపించారు. అతడికి చేసిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ట్రయల్స్‌కు ఎంపికయ్యాడు. ఈ విషయంలో తన కుటుంబం ఎంతగానో ప్రోత్సహించిందని అతడు చెప్పుకొచ్చాడు. తాను సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తున్నట్లుగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు.

ఈ ట్రయల్స్‌పై మహారాష్ట్ర మంత్రి, ఆసుపత్రి చాన్స్‌లర్ డాక్టర్ విశ్వజీత్ కదమ్ స్పందించారు. ‘ప్రపంచమంతా కరోనాపై కచ్చితంగా పోరాడగలిగే వ్యాక్సిన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నేపథ్యంలో భారతి ఆసుపత్రిలో ట్రయల్స్‌ కోసం ఇద్దరు వాలంటీర్లు ముందుకు రావడం చాలా సంతోషకరం. వీరిద్దరినీ రాబోయే ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతాము’ అని అన్నారు.

మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్థారించుకుంటే.. ఐసీఎంఆర్ ఆమోదం కోసం సీరమ్ సంస్థ దరఖాస్తు చేసుకుంటుంది. ఆ తర్వాత దీన్ని భారీ ఎత్తున ఉత్పత్తి చేసే అవకాశం ఉంది అని డాక్టర్ కదమ్ అన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్త్రాజెనెకా ఫార్మా కలసి తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఇప్పటికే సీరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

First Published:  27 Aug 2020 9:53 PM GMT
Next Story