Telugu Global
International

అంతరించిపోతున్న ఆ జాతిపై కరోనా పంజా

ప్రపంచం ఎంతో అభివృద్ది చెందింది. దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయి ఉద్యోగం, వ్యాపారం, విద్య నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కానీ కొన్ని ఆదిమ జాతులు, ఆదివాసీలు మాత్రం ప్రపంచానికి దూరంగా.. తమ ప్రాంతం దాటి బయటకు రాకుండా జీవిస్తున్నారు. అమెజాన్ పరివాహక ప్రాంతం, ఆఫ్రికా ఖండంతో పాటు మన దేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఇలాంటి ఆదిమ జాతి మనుషులు జీవిస్తున్నారు. అండమాన్ దీవుల్లో గ్రేట్ అండమానీస్ ట్రైబ్, జరువా వంటి తెగలతో పాటు సెంటినలిస్ వంటి […]

అంతరించిపోతున్న ఆ జాతిపై కరోనా పంజా
X

ప్రపంచం ఎంతో అభివృద్ది చెందింది. దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయి ఉద్యోగం, వ్యాపారం, విద్య నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కానీ కొన్ని ఆదిమ జాతులు, ఆదివాసీలు మాత్రం ప్రపంచానికి దూరంగా.. తమ ప్రాంతం దాటి బయటకు రాకుండా జీవిస్తున్నారు. అమెజాన్ పరివాహక ప్రాంతం, ఆఫ్రికా ఖండంతో పాటు మన దేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఇలాంటి ఆదిమ జాతి మనుషులు జీవిస్తున్నారు. అండమాన్ దీవుల్లో గ్రేట్ అండమానీస్ ట్రైబ్, జరువా వంటి తెగలతో పాటు సెంటినలిస్ వంటి జాతి ప్రజలు నివసిస్తున్నారు.

సెంటినలిస్ జాతి ప్రజలు అసలు మనుషులతో కలవరు. కనీసం తాము నివసించే దీవి సమీపంలోనికి వచ్చే బయటి వ్యక్తులను చంపేస్తారు. అయితే గ్రేట్ అండమానీస్ ట్రైబ్ మాత్రం గత కొన్నేండ్లుగా కాస్తో కూస్తో బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకుంటుంది. సంబంధాంటే అవి కేవలం వస్తు మార్పిడి వరకు మాత్రమే పరిమితం. విద్య, వైద్యం, నాగరిక ప్రపంచానికి వాళ్లు దూరంగానే ఉంటున్నారు. 1850 ప్రాంతంలో 8 వేల మంది జనాభా ఉండగా.. 50 ఏళ్లు గడిచే సరికి వారి జనసంఖ్య ఏకంగా 625కి పడిపోయింది. 1931లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం 90 మంది, 1960 జనాభా లెక్కల ప్రకారం 19 మంది మాత్రమే గ్రేట్ అండమానీస్ ట్రైబ్స్ ఉన్నారు.

స్ట్రెయిట్ ఐలాండ్ ప్రాంతంలో ప్రస్తుతం 59 మంది గ్రేట్ అండమానీస్ ట్రైబ్స్ నివసిస్తున్నారు. వీరిలో 10 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు తేల్చారు. దీంతో వారి ప్రాంతంలోనే ఆ పది మందిని ఐసోలేషన్ చేశారు. ప్రస్తుతం వీరిలో ఐదుగురు కోలుకున్నారు. మరో ఐదుగురు ఐసోలేషన్‌లో ఉన్నారు. సాధారణంగా అడవుల్లో, సాధారణ ప్రజలకు చాలా దూరంలో ఉండే వీళ్లకు కరోనా సోకడంపై అధికారులు ఆరా తీశారు.

వీళ్లు అప్పుడప్పుడు నిత్యావసరాల కోసం వస్తు మార్పిడి పద్దతి ద్వారా సమీప గ్రామం, పట్టణం నుంచి సరుకులు తీసుకొని పోతున్నారు. అలా ఎవరైనా బయటకు వచ్చిన వారి ద్వారా కరోనా సోకి ఉంటుందని నిర్థారించారు. దీంతో వారి అడవి గుండా సాగే అండమాన్ ట్రంక్ రోడ్డు, జరవా రిజర్వ్ ఫారెస్టు గుండా వెళ్లే వాహనాల డ్రైవర్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా, ఆ తెగ ప్రజలు నివసించే ప్రాంతాలకు ఏఎన్ఎంలను పంపి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అరుదైన ఈ జాతి ప్రజలు కరోనా బారిన పడి అంతరించిపోకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది.

First Published:  28 Aug 2020 8:43 PM GMT
Next Story