మన బొమ్మలను మనమే తయారు చేద్దాం – ప్రధాని మోదీ

ఆత్మ నిర్భర్ భారత్ వైపు మనం సాగిపోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇతర దేశాల ఉత్పత్తులపై ఆధారపడకుండా, మేకిన్ ఇండియా పద్దతిలో అన్నీ ఇక్కడే తయారు చేసుకుందామని ఆయన అన్నారు.

కరోనా సమయంలో కూడా రైతులు కష్టపడి పంటలు సాగు చేస్తున్నారని, ఆ విషయంలో వారిని మెచ్చుకోకుండా ఉండలేనని మోదీ అన్నారు. ప్రతీ చివరి ఆదివారం ఆయన ‘మన్ కీ బాత్’ పేరుతో ఆయన దేశ ప్రజలకు సందేశం ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతులు చేస్తున్న కృషిని కొనియాడుతూ… మన వేదాల్లో రైతుల గురించి అనేక శ్లోకాలు ఉన్నాయని చెప్పారు. కరోనా వచ్చినా గత ఏడాది కంటే ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు.

మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలు ప్రకృతితో ముడిపడి ఉన్నాయని మోడీ అన్నారు. మనం ప్రతీ వేడుకను పర్యావరణహితంగా జరపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత కష్టకాలంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని పండుగలు జరుపుకుందామని ఆయన చెప్పారు. మన దేశంలో జరిపే ఓనం పండుగ ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించిందని ఆయన చెప్పారు.

మరోవైపు పిల్లల బొమ్మలు కూడా మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇకపై స్థానికంగానే బొమ్మలు తయారు చేసుకుందాం. ఇందుకు నిరుద్యోగ యువత ముందుకొచ్చి తమ కాళ్లపై నిలబడేలా వ్యాపారం చేయాలని ఆయన కోరారు.

బొమ్మల ద్వారా స్థానిక కళలు, కళాకారులను మనం మరింతగా ప్రోత్సహించే అవకాశం కలుగుతుందన్నారు. మన యొక్క కళానైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం వచ్చిందని మోడీ అన్నారు. ఆ విధంగా మనం ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేద్దామని ఆయన అన్నారు.