టీనేజి అమ్మాయి…. తల్లిని, సోదరుణ్ణి చంపేసింది !

మానసిక సమస్యలు చాపకింద నీరులా యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని రుజువు చేస్తూ అనేక దారుణాలు మన కళ్లముందుకొస్తున్నాయి. లక్నోలో ఒక టీనేజి అమ్మాయి తన తల్లిని, సోదరుణ్ణి పిస్టల్ తో కాల్చి చంపింది. ఆమె తండ్రి ఉన్నత హోదాలో ఢిల్లీలో పనిచేస్తుండగా తల్లీపిల్లలు లక్నోలో నివసిస్తున్నారు. రెండు హత్యలు తానే చేశానని ఆ అమ్మాయి ఒప్పుకుంది.

ఆమె ఈ హత్యలు చేయడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని… అయితే ఆ అమ్మాయి డిప్రెషన్ లో ఉందని పోలీసులు తెలిపారు. సోదరుడిని తలవద్ద కాల్చిందని, రక్తం బాగా పోయిందని, తల్లి శరీరంలో గాయాలను ఇంకా గుర్తించలేదని లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే వెల్లడించారు.

పోలీసులు ఆమెనుండి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాను తన చేతిని రేజర్ తో కోసుకున్నట్టుగా  విచారణలో  టీనేజి బాలిక వెల్లడించగా పోలీసులు… ఆమె కుడి చేతికున్న కట్టుని విప్పి చూశారు. ఆ చేతిపైన అప్పటి గాయాలతో పాటు… పాత గాయాలు సైతం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

‘ఇప్పటికయితే ఆ అమ్మాయి డిప్రెషన్ తో బాధపడుతున్నట్టుగా తేలింది… తన తాత ఎదురుగా ఆమెని ప్రశ్నించాము. ఆమెని జువెనైల్ హోమ్ కి పంపేవరకు మా సంరక్షణలోనే ఉంచుతాము. వాళ్ల నాన్న ఇక్కడికి వస్తున్నారు’ అని పాండే వెల్లడించారు.

ఆ అమ్మాయి హత్యలు చేస్తున్నపుడు ఇంట్లో ఆరునుండి ఏడుగురు పనివాళ్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆమె హత్యలు చేయడానికి కారణం డిప్రెషనేనని వారు భావిస్తున్నారు. బాత్ రూమ్ లో ‘అర్హతలేని మనిషి’ అని అర్థం వచ్చే మాటలు ఆంగ్లంలో రాసి ఉండటం పోలీసులు గుర్తించారు. అవి తానే రాశానని, తన గురించేనని ఆ అమ్మాయి చెప్పింది. ఆమె పిస్టల్ తో అద్దాన్ని కూడా షూట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.