Telugu Global
National

టీడీపీ అంతం... బీజేపీ పంతం... అంటే ఇదేనా...?

మా మొదటి టార్గెట్ టీడీపీయేనంటూ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాతనుంచి పదే పదే చెప్పుకొచ్చారు ఏపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇంతకీ వీర్రాజు ప్రణాళిక ఏమై ఉంటుందా అని అందరూ ఆలోచించారు. ఊహించినట్టుగానే టీడీపీ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకత్వం మంతనాలు సాగిస్తోందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలనుంచి ఓ స్థాయి నాయకులను తమవైపు లాగేసుకుంటే.. టీడీపీని పరోక్షంగా పెద్ద దెబ్బ కొట్టినట్టు అవుతుందని, ఏపీ అసెంబ్లీలోకి మళ్లీ తమ ఎంట్రీ సాధ్యమవుతుందని అనుకుంటున్నారు నేతలు. అదే జరిగితే సరిదిద్దుకోలేని […]

టీడీపీ అంతం... బీజేపీ పంతం... అంటే ఇదేనా...?
X

మా మొదటి టార్గెట్ టీడీపీయేనంటూ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాతనుంచి పదే పదే చెప్పుకొచ్చారు ఏపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇంతకీ వీర్రాజు ప్రణాళిక ఏమై ఉంటుందా అని అందరూ ఆలోచించారు. ఊహించినట్టుగానే టీడీపీ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకత్వం మంతనాలు సాగిస్తోందని తెలుస్తోంది.

ఎమ్మెల్యేలనుంచి ఓ స్థాయి నాయకులను తమవైపు లాగేసుకుంటే.. టీడీపీని పరోక్షంగా పెద్ద దెబ్బ కొట్టినట్టు అవుతుందని, ఏపీ అసెంబ్లీలోకి మళ్లీ తమ ఎంట్రీ సాధ్యమవుతుందని అనుకుంటున్నారు నేతలు. అదే జరిగితే సరిదిద్దుకోలేని తప్పు చేసినట్టవుతుందనేది మరికొంతమంది బీజేపీ నేతల వాదన. ఇలా వలసలను సమర్థించేవారు, వ్యతిరేకించేవారు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు.

ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్సీ బీజేపీలో చేరారు. వీరి చేరిక వల్ల కమలదళానికి కౌంట్ పెరిగిందే కానీ ప్రత్యేక ప్రయోజనమేమీ లేదు. ఏతావాతా.. కేసుల భయంతో వచ్చేవారిని అక్కున చేర్చుకునేందుకు బీజేపీ అనే పార్టీ ఒకటుందనే విషయాన్ని మరోసారి రుజువు చేసినట్టయింది. చంద్రబాబు డైరక్షన్లోనే వారంతా బీజేపీలో చేరారని, ఈ విషయం కాషాయ పార్టీ అధిష్టానానికి కూడా తెలుసనే చెడ్డపేరు కూడా ఉంది.

దీనికి బలం చేకూర్చేలా.. జెండా మార్చినా.. చంద్రబాబు అజెండానే అమలు చేస్తూ బీజేపీకి మరింత తలనొప్పిగా తయారయ్యారు సుజనా చౌదరి వంటి నేతలు. చివరకు రాష్ట్ర పార్టీ నాయకత్వంలో మార్పులొచ్చాకే ఇలాంటివారి నోటికి తాళం పడింది. ఇప్పుడిక టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే.. వారు బీజేపీకి విధేయులుగా ఉంటారని ఎలా నమ్మాలి? చంద్రబాబు తెరవెనక ఉండి మరింతగా బీజేపీని భ్రష్టుపట్టించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు బీజేపీ లాయలిస్ట్ లు. పొరపాటున కూడా ఆ పనిచేయొద్దని అధిష్టానాన్ని వేడుకుంటున్నారు.

వచ్చే ఎన్నికలనాటికి కూడా రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిలో మార్పు ఉండదని, వీలైతే మరింత తీసికట్టుగా తయారవుతుందనే అనుమానం ఆ పార్టీ ఎమ్మెల్యేలలోనూ ఉంది. కండువా మార్చుకోకపోయినా వైసీపీ స్టాండ్ తీసుకున్నవారున్నారు. అటువైపు అడుగు వేద్దామనుకుంటున్న మరి కొంతమందిని స్థానిక వైసీపీ నాయకులు కసిరి కసిరి కొడుతున్నారు.

ఈ నేపథ్యంలో గాలం వేయకపోయినా కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ బుట్టలో నేరుగా వచ్చి పడే అవకాశాలున్నాయి. అలాంటి అవకాశవాదులతో ఏంటి ప్రయోజనం? వారిని చేర్చుకుంటే ఏంటి నష్టం? అని తర్జన భర్జన పడుతున్నారు బీజేపీ వ్యూహకర్తలు.

వచ్చే ఎన్నికలనాటికి స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుని, జనసేన సపోర్ట్ తో బరిలో దిగితే.. కచ్చితంగా టీడీపీని మించి సీట్లు సాధించవచ్చనేది కొంతమంది వాదన. అలా కాకుండా టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే.. కార్యకర్తల్లో నమ్మకం సన్నగిల్లుతుందని అంటున్నారు. మలిదశ చేరికల వ్యవహారం ఎంతవరకు వస్తుందో చూడాలి.

First Published:  1 Sep 2020 8:46 AM GMT
Next Story