Telugu Global
CRIME

ఉద్యోగాలు ఇప్పిస్తానని... నలుగురి ప్రాణాలు తీశాడు !

మహారాష్ట్రలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని భార్యా భర్తలు, ఇద్దరు కొడుకులు హత్యకు గురయ్యారు. సంగ్లి జిల్లా మిరాజ్ తాలూకాలోని బమ్నోలీ అనే గ్రామం ఈ కుటుంబానిది. సంగ్లి జిల్లాకు పక్కనే ఉన్న సతారా జిల్లా పోలీసులు ఈ హత్యలను కనుగొన్నారు.  మృతులందరికీ విషమిచ్చి కర్రతో బలంగా కొట్టి చంపినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలు చేసిన వ్యక్తి ఆ కుటుంబానికి తెలిసినవాడు….  డబ్బుతీసుకుని కుటుంబంలోని మగపిల్లలకు సెక్యురిటీ గార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించినవాడు. […]

ఉద్యోగాలు ఇప్పిస్తానని... నలుగురి ప్రాణాలు తీశాడు !
X

మహారాష్ట్రలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని భార్యా భర్తలు, ఇద్దరు కొడుకులు హత్యకు గురయ్యారు. సంగ్లి జిల్లా మిరాజ్ తాలూకాలోని బమ్నోలీ అనే గ్రామం ఈ కుటుంబానిది. సంగ్లి జిల్లాకు పక్కనే ఉన్న సతారా జిల్లా పోలీసులు ఈ హత్యలను కనుగొన్నారు. మృతులందరికీ విషమిచ్చి కర్రతో బలంగా కొట్టి చంపినట్టుగా పోలీసులు వెల్లడించారు.

ఈ హత్యలు చేసిన వ్యక్తి ఆ కుటుంబానికి తెలిసినవాడు…. డబ్బుతీసుకుని కుటుంబంలోని మగపిల్లలకు సెక్యురిటీ గార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించినవాడు. అతనిపేరు యోగేష్ నికమ్. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. హత్యకు గురయిన భార్యాభర్తల పేర్లు తానాజీ వితోబా జాదవ్, మందాకిని. కొడుకులు తుషార్, విశాల్…వీరు 26, 20 ఏళ్ల వయసువారు.

గత నెల11 వ తేదీన పోలీసులు సతారా జిల్లా అడవిలో కుళ్లినదశలో ఉన్న పురుషుడి మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే ఆ మృతదేహం ఎవరిదనే ఆధారాలేమీ లభించకపోవటంతో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగలేదు. తరువాత గత నెల 29న ఒక స్త్రీ మృతదేహం అదే ప్రాంతంలో మరో చోట కనిపించింది. మహిళ మృతదేహంపై ఆమె ఫలానా గ్రామానికి చెందినది… అనే సమాచారంతో ఉన్న పేపరు ముక్క కనిపించడంతో … మృతులు జాదవ్, మందాకినులు అని గుర్తించిన పోలీసులు రెండు హత్యలపై విచారణ మొదలుపెట్టారు.

ఆ భార్యాభర్తలిద్దరూ… సెక్యురిటీ ఏజన్సీలో ఉద్యోగాలకోసం ముంబయికి వెళ్లిన కొడుకుల వద్దకు వెళుతున్నామని చెప్పారని… గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. ఓ వ్యక్తి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పినట్టుగా కూడా పోలీసుల కనుగొన్నారు. దాంతో వారు మరింతగా కూపీలాగి… యోగేష్ నికమ్ ని అదుపులోకి తీసుకున్నారు. మొదట తనకేమీ తెలియదన్న నికమ్… పోలీసులు మరింత కఠినంగా ఇంటరాగేట్ చేసేసరికి కుటుంబం మొత్తాన్నీ తానే చంపానని ఒప్పుకున్నాడు. ఆ తరువాత యువకుల మృతదేహాలను సైతం పోలీసులు అదే ప్రాంతంలో గుర్తించారు.

యోగేష్ నికమ్ గతంలో మహారాష్ట్ర స్టేట్ హోం గార్డు ఫోర్స్ లో పనిచేశాడు. రెండు లక్షలిస్తే తుషార్, విశాల్ లకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు.

డబ్బు తీసుకున్నాక… అన్నదమ్ములను ముంబయికి తీసుకువెళుతున్నానని చెప్పి తీసుకుని వెళ్లాడు. వారికి మత్తుమందు ఇచ్చి కర్రతో బలంగా కొట్టి చంపి… మృతదేహాలను అడవిలో పడేశాడు. ఇది జులై రెండోవారంలో జరిగింది. తల్లిదండ్రులు తమ కొడుకుల గురించి అడుగుతుండటంతో వారిని కూడా అదే ప్రాంతానికి రమ్మని చెప్పి అదేవిధంగా కొట్టి చంపాడు.

సెక్యురిటీ జాబ్ ల కోసం నికమ్ కి డబ్బు ఇచ్చి మోసపోయినవారు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి తమకు చెప్పాల్సిందిగా…. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న డిఎస్ పి అజిత్ టైక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల పేరుతో డబ్బునీ ప్రాణాలను హరిస్తున్న మోసగాళ్లు తరచుగా సమాజంలో కనబడుతున్నారు. అయినా అలాంటివి మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగం అనగానే వెంటనే నమ్మేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి సంఘటనలు హెచ్చరిస్తున్నాయి.

First Published:  2 Sep 2020 10:40 AM GMT
Next Story