Telugu Global
International

యాప్స్ నిషేధిస్తే... చైనాతో యుద్ధం గెలిచినట్టేనా...?

చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించింది, డ్రాగన్ దూకుడుకి కళ్లెం వేసింది. జాతీయ మీడియాలో జోరందుకుంటున్న ప్రచారం ఇది. అసలు చైనా యాప్స్ పై నిషేధం విధించినంత మాత్రాన ఆదేశానికి వచ్చే నష్టమేంటి? పోనీ ఆర్థికంగా కొద్దో గొప్పో నష్టం వచ్చిందనుకుందాం. అంతమాత్రాన సరిహద్దుల వద్ద చైనా తన దూకుడు తగ్గించుకుంటుందా? టిక్ టాక్ తీసేస్తే, పబ్జీని బ్యాన్ చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలుతుందో, దానివల్ల భారత్ కి కలిగే ప్రయోజనం ఏంటో […]

యాప్స్ నిషేధిస్తే... చైనాతో యుద్ధం గెలిచినట్టేనా...?
X

చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించింది, డ్రాగన్ దూకుడుకి కళ్లెం వేసింది. జాతీయ మీడియాలో జోరందుకుంటున్న ప్రచారం ఇది.

అసలు చైనా యాప్స్ పై నిషేధం విధించినంత మాత్రాన ఆదేశానికి వచ్చే నష్టమేంటి? పోనీ ఆర్థికంగా కొద్దో గొప్పో నష్టం వచ్చిందనుకుందాం. అంతమాత్రాన సరిహద్దుల వద్ద చైనా తన దూకుడు తగ్గించుకుంటుందా? టిక్ టాక్ తీసేస్తే, పబ్జీని బ్యాన్ చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలుతుందో, దానివల్ల భారత్ కి కలిగే ప్రయోజనం ఏంటో ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిందే. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు కాస్త గట్టిగానే పట్టుకున్నాయి.

రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు కానీ, కేంద్రం వైఫల్యాలను సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. కరోనా విలయం సృష్టిస్తోంది, ఆర్థికంగా నష్టం కలిగిస్తోందన్న మాట వాస్తవమే. అదే సమయంలో ఇతర దేశాల్లో పరిస్థితులు మరీ ఇంత ఘోరంగా ఏమీ లేవు. దేశంలో జీడీపీ ఎప్పుడూ లేనంతగా 23.9 శాతం మేర పడిపోయింది. నిరుద్యోగిత 45ఏళ్ల రికార్డు స్థాయికి చేరుకుంది. 12కోట్లమంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయారు, జీఎస్టీ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రాలు తిప్పలు పడుతున్నాయి. అటు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉండనే ఉన్నాయి.

వీటన్నిటికీ ప్రధాని మోదీ ఏమని సమాధానం చెబుతారు. లాక్ డౌన్ అమలు చేసిన కొత్తల్లో గంట కొట్టమన్నారు, చప్పట్లు కొట్టమన్నారు, దీపాలు వెలిగించమన్నారు.. ఇలా ఏదోరకంగా ప్రజల్ని మాయ చేశారే కానీ సరైన నివారణ చర్యలు మాత్రం చేపట్టలేకపోయారన్న అపవాదు మోదీపై ఉంది.

ముఖ్యంగా వలస కార్మికుల తరలింపు వ్యవహారంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చింది. తీరా ఇప్పుడు చేతులు కాలాక కూడా ఆకులు పట్టుకోవడంలేదు మోదీ. మొన్నటికి మొన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో బొమ్మలు, దేశీయ శునకాల గురించి మాట్లాడి పూర్తిగా నవ్వులపాలయ్యారు మోదీ. సోషల్ మీడియాలో భారీగా డిజ్ లైక్ లు రావడంతో మరోసారి చైనా యాప్స్ పై గురిపెట్టారు.

జూన్ లో ఓసారి చైనాతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో, ఉత్తి పుణ్యానికి మన సైనికుల ప్రాణాలు పోయాయన్న విమర్శల నేపథ్యంలో టిక్ టాక్ సహా 59 యాప్ లపై నిషేదం విధించి చంకలు గుద్దుకుంది కేంద్రం. టిక్ టాక్ నిషేధించి భారత్ చైనాని చావుదెబ్బ కొట్టిందని మోదీ అనుకూల మీడియా కోడై కూసింది.

ఇప్పుడు మరో దఫా చైనా దురాక్రమణలకు సిద్ధపడిందన్న వార్తల నేపథ్యంలో ఏకంగా పబ్జీ సహా 118 యాప్ లపై నిషేధం విధించి మోదీ తన ప్రతాపం చూపించారని వేనోళ్ల పొగుడుతోంది. అసలు దేశంలో ఉన్న సమస్యలేంటి, చైనా యాప్స్ పై నిషేధం ఏంటి? విజయవంతంగా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కృషిచేస్తోంది కేంద్రం. యథా శక్తి మోదీకి వంతపాడుతోంది అనుకూల మీడియా.

First Published:  3 Sep 2020 1:24 AM GMT
Next Story