మనదేశంలో నిరుద్యోగ ఆత్మహత్యలు… పదిశాతం !

ఇప్పటికీ మనదేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగానే ఉంది. గత ఏడాది అంటే 2019లో దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 1,39,123. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందిస్తున్న వివరాలను బట్టి… ఇందులో రెండుశాతం మంది కేవలం నిరుద్యోగం వల్లనే ప్రాణాలు తీసుకున్నారు.

అయితే ఆత్మహత్య చేసుకున్నవారిలో 10.1శాతం మంది ఉద్యోగం లేనివారేనని తెలుస్తోంది. ఉద్యోగం లేకపోవటం అనేది వారిని అలాంటి నిర్ణయం తీసుకునేలా చేసిందా… లేదా అనేది తెలియకపోయినా… ఈ విషయంసైతం ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగం కారణంగా ప్రాణాలు తీసుకున్నవారిలో ఎక్కువమంది 18-30 సంవత్సరాల మధ్య వయసు వారు.

2018తో పోలిస్తే 2019లో ఆత్మహత్యల సంఖ్య 3.4శాతం వరకు పెరిగింది.

ఆత్మహత్యల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యల విషయంలో కర్ణాటక ముందుంది.

ఇక ఎక్కువమంది ఆత్మహత్యలకు పాల్పడిన కారణం కుటుంబ సమస్యలు. ఈ సంఖ్య మొత్తం ఆత్మహత్యల్లో 32.4 శాతంగా ఉంది. అనారోగ్యం కారణంగా ప్రాణాలు తీసుకున్నవారు 17.1శాతం మంది. మొత్తం ఆత్మహత్యల్లో 7.4 శాతం మంది అంటే 10,281మంది వ్యవసాయ రంగానికి చెందినవారు. ఇంకా ఆత్మహత్యలకు దారితీసిన అంశాల్లో డ్రగ్స్ కి బానిస కావటం, కెరీర్ పరంగా సమస్యలు, ప్రేమ, వివాహేతర సంబంధాల్లాంటి వ్యవహారాలు, ఆర్థికంగా దివాళా తీయటం వంటివి  ఉన్నాయి.

నిరుద్యోగం కారణంగా ఎక్కువ ఆత్మహత్యలు సంభవించిన రాష్టాలు… కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, గుజరాత్. 2018లోకూడా కర్ణాటక, మహారాష్ట్రలు ఈ విషయంలో ముందున్నాయి.

2019లో ఆత్మహత్యలకు పాల్పడినవారిలో మగవారి శాతం 70.2 ఉంటే మహిళలు 29.8శాతం మంది ఉన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన మగవారిలో ఎక్కువమంది రోజువారీ కూలీలు. ఆ తరువాత స్థానాల్లో సొంతంగా ఉపాధిని పొందుతున్నవారు, నిరుద్యోగులు ఉన్నారు. ఆడవారిలో ఆత్మహత్యలకు ప్రధాన కారణం వివాహ సంబంధమైన సమస్యలు… ప్రధానంగా వరకట్న సమస్య. తరువాత కారణం భర్తల నపుంసకత్వం, సంతానలేమి.

మొత్తం ఆత్మహత్యలకు పాల్పడినవారిలో వివాహితులు 66.7శాతం కాగా అవివాహితులు 23.6శాతం ఉన్నారు.  66.2శాతం మంది లక్ష కంటే తక్కువగా సంవత్సరాదాయం ఉన్నవారు కాగా 26.9శాతం మంది ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు సంవత్సరాదాయం ఉన్నవారు. ఏదిఏమైనా ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, పేదరికం… ఈ అంశాలే ప్రధానంగా ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని చెప్పవచ్చు.