Telugu Global
Health & Life Style

నిద్రలేకపోతే... పొట్టలోని బ్యాక్టీరియాకు చేటు !

నిద్రలేమి, రక్తపోటు, పొట్టలో ఉండే  బ్యాక్టీరియా…. ఈ మూడింటికీ సంబంధం ఉందని ఓ నూతన అధ్యయనం వెల్లడించింది. మన జీర్ణవ్యవస్థలో కోట్ల సంఖ్యలో సూక్ష్మ జీవులు ఉంటాయి. వీటిని గట్ బ్యాక్టీరియా అంటారు. ఇందులో మనకు మేలు చేసేవి హాని చేసేవి రెండూ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా మనం తిన్న ఆహారం జీర్ణం అవడానికే కాకుండా ఇంకా అనేక రకాలుగా మన ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన గట్ బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. […]

నిద్రలేకపోతే... పొట్టలోని బ్యాక్టీరియాకు చేటు !
X

నిద్రలేమి, రక్తపోటు, పొట్టలో ఉండే బ్యాక్టీరియా…. ఈ మూడింటికీ సంబంధం ఉందని ఓ నూతన అధ్యయనం వెల్లడించింది. మన జీర్ణవ్యవస్థలో కోట్ల సంఖ్యలో సూక్ష్మ జీవులు ఉంటాయి. వీటిని గట్ బ్యాక్టీరియా అంటారు. ఇందులో మనకు మేలు చేసేవి హాని చేసేవి రెండూ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా మనం తిన్న ఆహారం జీర్ణం అవడానికే కాకుండా ఇంకా అనేక రకాలుగా మన ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన గట్ బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మరి అలాంటి బ్యాక్టీరియా నిద్ర లేకపోవటం వలన మార్పులకు గురవుతుందని పరిశోధకులు అంటున్నారు.

చికాగోలోని ఇల్లినాయిస్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అంశంపై పరిశోధన నిర్వహించగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ తరహా పరిశోధన చేయటం ఇదే మొదటిసారని తెలుస్తోంది. 28 రోజుల పాటు సరైన నిద్రలేకపోవటంవలన… ఎలుకల పొట్టలో ఉండే బ్యాక్టీరియాలో, అలాగే గుండెలోని రక్తనాళాల్లో వచ్చే మార్పులను ఈ పరిశోధనలో అధ్యయనం చేశారు. ఎలుకలు రాత్రిపూట మెలకువగా చురుగ్గా ఉంటాయి కనుక వాటి పగటి నిద్రకు భంగం కలిగించి… వాటిలో వచ్చే ఆరోగ్యపరమైన మార్పులను అధ్యయనం చేశారు. వాటి గుండెకొట్టుకునే వేగం, రక్తపోటు, మెదడు పనితీరు మొదలైన అంశాలన్నింటినీ పరిశీలించారు.

నిద్రలో అంతరాయం కలిగిన ఎలుకల్లో రక్తపోటు పెరగటం పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు… అవి తిరిగి సాధారణ వేళల్లో నిద్రపోతున్నప్పటికీ అదే రక్తపోటు ఉండటం కూడా గమనించారు. సరైన నిద్రలేకపోవటం వలన కలిగే ఆరోగ్య సమస్యలు అంత త్వరగా పోవని కూడా పరిశోధకులు అంటున్నారు. అలాగే మంచి నిద్రలేకపోవటం వలన పొట్టలో ఉండే బ్యాక్టీరియాలో కూడా హానికరమైన మార్పులు చోటు చేసుకోవటం పరిశోధకులు గుర్తించారు.

ఎలుకల నిద్రకు భంగం కలగటం వలన వాటి గట్ బ్యాక్టీరియాలో ఎన్నో అసమతౌల్యతలు ఏర్పడినట్టుగా… ముఖ్యంగా శరీరంలో వాపు గుణాన్ని పెంచే బ్యాక్టీరియా పెరగటం శాస్త్రవేత్తలు గమనించారు. అయితే ఈ రకమైన పరిశోధనలు ఇప్పుడు తొలిదశలో ఉన్నాయి. నిద్రవేళల్లో మార్పులు… రక్తపోటుపైన, పొట్టలోని బ్యాక్టీరియాపైన ఎలాంటి మార్పులు చూపుతున్నాయి, ఆ మార్పులు ఎంతకాలం ఉంటున్నాయి… మొదలైన అంశాలపై మరిన్ని పరిశోధనలు నిర్వహించాల్సి ఉంది. అలాగే ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలను మనుషులకు అన్వయించి చూడాల్సి ఉంది.

రాత్రి షిప్టుల్లో పనిచేసేవారికి వైద్య సలహాలను ఇస్తున్న డాక్టర్లు వెల్లడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని….ఈ అధ్యయనం నిర్వహించాలనే ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది. నిద్ర, రక్తపోటు, గట్ బ్యాక్టీరియా…. ఈ అంశాల మధ్య ఉన్న సంబంధాలను సమగ్రంగా తెలుసుకోవటం వలన… అనివార్యంగా నిద్రమేలుకుని ఉండాల్సిన ఉద్యోగాలు చేస్తున్నవారు… ఆరోగ్య సమస్యలకు గురికాకుండా కొత్త థెరపీలను, ఆహారంలో మార్పులను సూచించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

First Published:  6 Sep 2020 11:30 PM GMT
Next Story