Telugu Global
National

నకిలీ ఏసీబీ ముఠాకు భారీగా సమర్పించుకున్న ప్రభుత్వ అధికారులు

ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వ అవినీతి ఉద్యోగులను బురిడికొట్టించిన నకిలీ ఏసీబీ ముఠా వ్యవహారంలో అసలైన ఏసీబీ కీలక వివరాలు రాబట్టింది. నకిలీ ఏసీబీ ముఠా దెబ్బకు భయపడి లక్షలకు లక్షలు వారికి లంచాలు సమర్పించుకున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఫోన్‌ చేసి బెదరగొట్టగానే లక్షలకు లక్షలు ప్రభుత్వ ఉద్యోగులే నకిలీ ఏసీబీ అధికారులకు లంచాలు ఇచ్చేశారంటే సదరు ఉద్యోగులు ఏ స్థాయిలో అవినీతి చేసి ఉంటారో అని అసలైన ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన […]

నకిలీ ఏసీబీ ముఠాకు భారీగా సమర్పించుకున్న ప్రభుత్వ అధికారులు
X

ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వ అవినీతి ఉద్యోగులను బురిడికొట్టించిన నకిలీ ఏసీబీ ముఠా వ్యవహారంలో అసలైన ఏసీబీ కీలక వివరాలు రాబట్టింది. నకిలీ ఏసీబీ ముఠా దెబ్బకు భయపడి లక్షలకు లక్షలు వారికి లంచాలు సమర్పించుకున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఫోన్‌ చేసి బెదరగొట్టగానే లక్షలకు లక్షలు ప్రభుత్వ ఉద్యోగులే నకిలీ ఏసీబీ అధికారులకు లంచాలు ఇచ్చేశారంటే సదరు ఉద్యోగులు ఏ స్థాయిలో అవినీతి చేసి ఉంటారో అని అసలైన ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన నూతేటి జయకృష్ణ చైన్‌స్నాచింగ్‌ చేసేవాడు. ఒకసారి అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన జయకృష్ణ.. జైలులో మరికొందరితో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. వారంతా జైలు నుంచి బయటకు రాగానే నకిలీ ఏసీబీ అధికారుల అవతారం ఎత్తారు. బాగా అవినీతి జరిగే శాఖలను గుర్తించి ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి పలువురు ప్రభుత్వ అధికారుల వివరాలను, ఫోన్‌ నెంబర్లను సేకరించారు.

అనంతరం వారికి ఫోన్ చేసి తాము ఏసీబీ అధికారులం అని… మీపై అనేక ఫిర్యాదులు వచ్చాయి.. విచారణలో ఆ ఫిర్యాదులు నిజమేనని తేలింది… మా డీఎస్పీగారు మీతో మాట్లాడుతారు… ఇప్పుడే కాన్ఫరెన్స్ కాల్ కలుపుతున్నాం అంటూ హడలెత్తించేవారు.

అదే ముఠాలోని మరొకరు ఏసీబీ డీఎస్పీని అంటూ బెదరగొట్టేవారు. అడిగినంత డబ్బు వెంటనే ఇవ్వాలని… లేకుంటే దాడులు చేస్తామని బెదిరించే వారు. ఇలా వీరి బెదిరింపులకు భయపడిపోయి పదుల సంఖ్యలో అవినీతి అధికారులు వీరికి లక్షలకు లక్షలు సమర్పించేశారు.

నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన అధికారులకూ ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ చేయగా… వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో
ఈ ముఠాను ఈనెల 1న కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా… ఈ నకిలీ ఏసీబీ వ్యవహారం కూడా బయటకు వచ్చింది.

ఏఏ ఉద్యోగుల నుంచి ఎంతెంత డబ్బులు తీసుకున్నది పోలీసులు వివరాలు సేకరించారు. ముఠా సభ్యులు చెప్పిన అధికారుల అక్రమార్జనపై అసలైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. మంగళవారం నుంచి ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ ముఠాకు భారీగా డబ్బు సమర్పించుకున్న వారిలో అమదాలవలస ఆర్‌ అండ్ బీ డీఈఈ జాన్ విక్లిఫ్‌ , శ్రీకాకుళం పంచాయతీరాజ్ ఇంజినీర్ జీఆర్‌ గుప్తా, విశాఖ జాయింట్ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ ఫ్యాక్టరీస్‌ శివశంకర్ రెడ్డి, ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో ఆర్‌ ప్రభాకర్ రావు, గుడివాడ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వెంకటేశ్వరరావు, మార్కాపురం ఎంవీఐ రామచంద్రరావు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి, చిత్తూరు ఆర్‌ అండ్ బీ ఈఈ గుడారం చంద్రశేఖర్, కడప నీటిపారుదల సర్కిల్ డిప్యూటీ ఎస్‌ఈ సీహెచ్ కృష్ణమూర్తి, పలమనేరు మున్సిపల్ కమిషనర్‌ విజయసింహారెడ్డి, నెల్లూరు జీఎస్టీ ఉప కమిషనర్‌ ఏఈవో వెంకట దుర్గ ప్రసాద్‌, గూడూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ టి.రాఘవరావు తదితరులున్నారు. వీరిలో కొందరు ఐదు లక్షల వరకు ఈ ముఠాకు ఇచ్చుకున్నారు.

First Published:  8 Sep 2020 11:36 PM GMT
Next Story