ఆడాళ్లు ఐపీఎల్ చూడనిస్తారా?

ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం అయి నవంబర్ 3 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏ రోజు ఏ మ్యాచ్, ఎన్ని గంటలకు అనే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది ఐపీఎల్. అయితే తాజాగా ఫిక్స్ చేసిన టైమింగులతో తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ కు దెబ్బ తప్పకపోవచ్చని భావిస్తున్నారు చాలామంది.

ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచులు రాత్రి 7.30కు ప్రారంభం అవుతున్నాయి. అదే టైమ్ లో తెలుగులో ”కార్తీకదీపం” సీరియల్ స్టార్ట్ అవుతుంది. సీరియల్ కు, క్రికెట్ మ్యాచులకు పోటీ ఏంటని లైట్ తీసుకోవద్దు. కార్తీకదీపం గురించి, అందులో వంటలక్క గురించి తెలుగు రాష్ట్రాల్లో ఏ మహిళను అడిగినా చెబుతారు. అంత పాపులర్ ఈ సీరియల్.

ప్రతి వారం టీఆర్పీల్లో టాప్ ప్లేస్ లో ఉండే సీరియల్ ఇది. ఏదో ఒకట్రెండు స్థానాల్లో కాదు.. ప్రతి వారం టాప్-5 రేటింగులు దీనివే. ఇంకా అర్థమైనట్టు చెప్పాలంటే.. ఆ టైమ్ లో ఆడాళ్లంతా ‘కార్తీకదీపం’ తప్ప మరో కార్యక్రమం చూడరు.

ఇప్పుడీ టైమ్ కు క్రికెట్ మ్యాచులు షెడ్యూల్ చేసింది ఐపీఎల్. ఇంట్లో యూత్, మగాళ్లంతా క్రికెట్ చూడాలనుకుంటారు. కానీ ఆడాళ్ల చేతుల నుంచి రిమోట్ తీసుకొని స్టార్ మా ఛానెల్ ను మార్చడం దాదాపు అసాధ్యం. ఓ 30 నిమిషాలు ఓపిక పట్టి, 8 నుంచి మ్యాచులు చూడాల్సిందే.