తమన్ మళ్లీ దొరికిపోయాడుగా

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కంపోజర్ ఎవరంటే తమన్ పేరు వినిపిస్తుంది. “అల వైకుంఠపురములో” సినిమాతో తమన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమా సినిమాకు మెరుగవుతూ “అల వైకుంఠపురములో” సినిమాకు వచ్చేసరికి టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు తమన్. దీంతో ఇతడిపై ఉన్న కాపీ క్యాట్ మరకలు దాదాపు చెరిగిపోయాయి.

అంతా సజావుగా సాగుతుందనుకున్న టైమ్ లో మరోసారి విమర్శలకు తావిచ్చాడు ఈ సంగీత దర్శకుడు. తన వర్కుతో తానే టార్గెట్ అయ్యాడు. అవును.. ‘వి’ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విమర్శల పాలైంది. మరోసారి తమన్ కాపీ క్యాట్ అవతారం ఎత్తాడంటూ సినిమా స్ట్రీమింగ్ కొచ్చిన కొన్ని గంటల వ్యవథిలోనే అతడిపై ట్రోలింగ్ మొదలైంది.

అది నిజం కూడా. ‘రాట్ససన్’ లాంటి కొన్ని తమిళ సినిమాలతో పాటు మరికొన్ని బాలీవుడ్ సినిమాల ‘స్ఫూర్తి’తో “వి” సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్. ఈ విషయాన్ని రిలీజైన మొదటి రోజే చాలామంది ప్రేక్షకులు గ్రహించారు. అంతేకాదు.. తమన్ ఏ సినిమాల నుంచి ఏ ట్యూన్ కాపీ కొట్టాడో ఆ ఆడియో/వీడియో క్లిప్పింగులు కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో తమన్ పై మరోసారి విమర్శల జడివాన తప్పలేదు.