Telugu Global
National

అంతర్వేదిలో టీడీపీ పాచిక పారలేదా..?

అంతర్వేదిలో రథం దగ్ధమైన సంఘటన జరిగిన వెంటనే బీజేపీకంటే వేగంగా స్పందించారు చంద్రబాబు. హిందూత్వాన్ని భుజాన వేసుకుని సోషల్ మీడియాలో యుద్ధానికి బయలుదేరారు. టీడీపీ నాయకులతో నిజనిర్థారణ కమిటీ వేసి మరీ ఆ విషయాన్ని తన అనూకూల మీడియాతో జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వైసీపీ మంత్రులు సంఘటనా స్థలానికి వెళ్తే.. జరిగిన రాద్ధాంతంలో బీజేపీకంటే టీడీపీ హస్తమే ఎక్కువగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. అంతర్వేది అనే చిన్న ఊరిలో ఉదయానికల్లా […]

అంతర్వేదిలో టీడీపీ పాచిక పారలేదా..?
X

అంతర్వేదిలో రథం దగ్ధమైన సంఘటన జరిగిన వెంటనే బీజేపీకంటే వేగంగా స్పందించారు చంద్రబాబు. హిందూత్వాన్ని భుజాన వేసుకుని సోషల్ మీడియాలో యుద్ధానికి బయలుదేరారు. టీడీపీ నాయకులతో నిజనిర్థారణ కమిటీ వేసి మరీ ఆ విషయాన్ని తన అనూకూల మీడియాతో జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత వైసీపీ మంత్రులు సంఘటనా స్థలానికి వెళ్తే.. జరిగిన రాద్ధాంతంలో బీజేపీకంటే టీడీపీ హస్తమే ఎక్కువగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. అంతర్వేది అనే చిన్న ఊరిలో ఉదయానికల్లా అంతమంది కాషాయ జెండాలు చేతబట్టుకుని ప్రత్యక్షమయ్యారంటే.. ఎంతప్లానింగ్ జరిగి ఉండాలి. ఈ ప్లానింగ్ కేవలం బీజేపీదిగా భావించలేం. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబు అని స్పష్టమవుతోంది.

గతంలో జరిగిన ఘటనల్ని కూడా ప్రస్తావిస్తూ ఏపీలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారనే స్థాయిలో చంద్రబాబు అంతర్వేది ఘటనకు మసాలా దట్టించారు. ఏదైనా దుర్ఘటన జరిగితే సహాయక చర్యలు చేపట్టడానికి రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్తారు. కానీ ఇక్కడ ఓ రథం కాలిపోయింది. ఎవరూ ఏం చేయడానికి లేదు, ఏదైనా చేస్తే ప్రభుత్వం విచారణకోసం అధికారుల్ని పంపించాలి, వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోడానికి అధికార పార్టీ నాయకులు వెళ్లాలి.

ఇవేవీ కాకుండా కరసేవకుల్లాగా కర్రలు, జెండాలు పట్టుకుని జనాల్ని అక్కడికి ఎందుకు పంపించినట్టు? ఏంచేయడానికి వారిని ప్రేరేపించినట్టు? శాంతి భద్రతల సమస్యలు సృష్టించే అజెండా ఉంది అని ఇంటెలిజెన్స్ వర్గాలు ఊహించబట్టే ముందస్తు బందోబస్తు చేశారు. డీజీపీ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ఆందోళనకారుల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. 20మందిని అరెస్ట్ చేశారు. దుందుడుకుగా వ్యవహరిస్తారనుకున్న నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో చంద్రబాబు పాచిక పారలేదు.

అంతర్వేది ఘటనను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అలజడి సృష్టించాలనుకున్న ఆయన పన్నాగం నెరవేరలేదు. కాపు ఉద్యమంలో కడప గూండాలు ప్రవేశించారని గతంలో అపనిందలు వేసిన చంద్రబాబు.. ఇప్పుడు కాషాయ ముసుగులో అంతర్వేదికి వచ్చినవారిలో టీడీపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో చెప్పగలరా..? పైపెచ్చు నిస్సిగ్గుగా సీబీఐ ఎంక్వయిరీ అంటూ చంద్రబాబు, లోకేష్ మాట్లాడటం వారి అవకాశవాద రాజకీయానికి పరాకాష్టగా నిలిచింది.

మొత్తమ్మీద అంతర్వేదిని అడ్డు పెట్టుకుని ఏదో చేద్దామనుకున్న బాబు, చివరకు ఏమీ చేయలేక పోయారు. బీజేపీ, జనసేన భుజాలపై తుపాకి పెట్టి కాల్చాలనుకున్న బాబు పాచిక పారలేదు.

First Published:  9 Sep 2020 9:57 PM GMT
Next Story