ఇదో పెద్ద ఏడుపుగొట్టు బిగ్ బాస్…

ప్రారంభమైన 4 రోజులకే బిగ్ బాస్ సీజన్-4 వ్యవహారం తేలిపోయింది. మొదటి 3 సీజన్లు ఎట్రాక్టివ్ ముఖాలు, ఇంట్రెస్టింగ్ టాస్కులతో సాగితే.. నాలుగో సీజన్ మాత్రం ముక్కుమొహం తెలియని ఫేసులు, నాసికరం డ్రామాలతో సాగుతోంది. కేవలం ఏడవడం కోసమే కంటెస్టెంట్స్ అంతా షో లోకి వచ్చినట్టు అనిపించింది.

నిజానికి ప్రారంభ ఎపిసోడ్ లోనే సెంటిమెంట్ పూశారు. ఎమోషన్ అద్దారు. అప్పుడే ప్రేక్షకులకు కాస్త అనుమానం కలిగింది. రోజులు గడిచేకొద్ది అదే అనుమానం నిజమైంది. సగానికి సగం మంది కంటెస్టెంట్లు ఏడుపు అందుకోవడం మొదలుపెట్టారు. చివరికి కాస్త గ్లామర్ గా కనిపించి కవ్విస్తుందనుకున్న హీరోయిన్ మోనాల్ గజ్జర్ కూడా ఏడుపు అందుకునేసరికి ప్రేక్షకులు మొహం మొత్తేసింది.

సోషల్ మీడియా ట్రెండ్స్ ద్వారా ప్రేక్షకుల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న స్టార్ మా యాజమాన్యానికి ఈ ఫీడ్ బ్యాక్ అందింది. ఇకపై ఎమోషన్, సెంటిమెంట్ తగ్గించాలని నిర్వహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా హౌజ్ నుంచి ఈ వీకెండ్ ఒకర్ని ఎలిమినేట్ చేసి, వైల్డ్-కార్డ్ ఎంట్రీ కింద మరో హీరోయిన్ ను అందులోకి పంపించాలని నిర్ణయించింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ వీకెండ్, హీరోయిన్ స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తుంది. తెలుగులో ‘జంప్ జిలానీ’, ‘లేడీస్ అండ్ జెంటిల్ మేన్’, ‘చిత్రాంగద’ లాంటి సినిమాల్లో నటించింది స్వాతి దీక్షిత్.