25వ సినిమా.. అంతేగా అంతేగా..!

ప్రతి హీరోకు అతడి కెరీర్ లో 25వ సినిమా కాస్త ప్రతిష్టాత్మకమే. 25వ సినిమాతో హిట్ కొడితే ఆ కిక్కే వేరు. కానీ టాలీవుడ్ లో దాదాపు ఏ హీరోకు 25వ సినిమా కలిసిరాలేదు. కావాలంటే మీరే చూడండి..

ముందుకు ఈ లిస్ట్ ను మెగాస్టార్ తో స్టార్ట్ చేద్దాం. నటుడిగా చిరంజీవి 25వ సినిమా హిట్ కాదు. అలా అని హీరోగా ఆయన నటించిన సినిమాల లిస్ట్ చూసుకున్నప్పటికీ చిరంజీవికి హిట్ లేదు.

ఇప్పుడు నాగార్జున విషయానికొద్దాం. తన 25వ సినిమాగా జైత్రయాత్ర మూవీ చేశాడు నాగ్. కానీ అతడి కెరీర్ లో అది బ్లాక్ బస్టర్ కాదు.

బాలయ్యకు కూడా 25వ సినిమా కలిసిరాలేదు. బాలయ్య హీరోగా నటించిన 25వ సినిమా ప్రెసిడెంట్ గారి అబ్బాయి. ఆ సినిమా ఆడలేదు.

ఇక ఎన్టీఆర్ విషయానికొద్దాం. తన 25వ చిత్రంగా నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు. క్రిటిక్స్ మెప్పు పొందిన ఈ సినిమా కాసులు కురిపించలేకపోయింది.

ఇక మహేష్ కెరీర్ లో 25వ సినిమా ఓ చేదు జ్ఞాపకం. అదే స్పైడర్. అతడి కెరీర్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా ఇది నిలిచిపోయింది.

అటు పవన్ కెరీర్ లో 25వ చిత్రంగా తెరకెక్కిన అజ్ఞాతవాసి, నితిన్ కెరీర్ లో 25వ చిత్రంగా తెరకెక్కిన ఛల్ మోహన్ రంగ సినిమాలు కూడా డిజాస్టర్లే.

తాజాగా ఓటీటీలో రిలీజైన V సినిమా నాని కెరీర్ లో 25వ చిత్రం. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. ఈ మొత్తం లిస్ట్ లో క్లిక్ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ మాత్రమే. తన 25వ చిత్రంగా వెంకీ చేసిన అనారీ అనే హిందీ సినిమా పెద్ద హిట్టయింది.