ఎల్‌పీజీ ధర పెంచలేదు… ఛానళ్లది అవగాహన రాహిత్యం – ఏపీ ప్రభుత్వం

ఏపీలో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లపై ప్రభుత్వం పన్నుభారం మోపిందంటూ టీవీ చానళ్లు చేస్తున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఎల్‌పీజీ గ్యాస్ ధర పెంచారంటూ చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండిస్తూ ఒకప్రకటన విడుదల చేసింది.

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం భారీగా పడిపోయిందని అందుకే దాన్ని పూడ్చుకునేందుకు నాచురల్ గ్యాస్‌ ధరలను పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్‌లో ఆదాయం 4వేల 480 కోట్లు రాగా… ఈసారి కరోనా వల్ల ఏప్రిల్‌లో కేవలం 1323 కోట్లు మాత్రమే వచ్చిందని జీవోలో వివరించింది. మే, జూన్‌, జులై, ఆగస్టుల్లోనూ అదే పరిస్థితి ఉందని వివరించింది. అందుకే నాచురల్ గ్యాస్‌పై టాక్స్‌ను 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పెంచుతున్నట్టు ప్రభుత్వం జీవోలో వివరించింది.

దీంతో టీవీ చానళ్లలో ఏపీ ప్రభుత్వం గ్యాస్‌ ధరలను పెంచేసిందని, ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను పెంచేసిందంటూ కథనాలను ప్రసారం చేశాయి. ఈ ప్రచారం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరపున స్పెషల్ సీఎస్‌ రజత్‌ భార్గవ్ ప్రకటన విడుదల చేశారు. ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెంచారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని వివరణ ఇచ్చారు.

ప్రభుత్వం స్వల్పంగా ట్యాక్స్ పెంచింది నాచురల్ గ్యాస్‌పైన అని… దీన్ని పరిశ్రమల్లో, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో వాడుతుంటారని వివరణ ఇచ్చారు. వంట గ్యాస్‌ ధరలను పెంచలేదని వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాల్లో అవగాహన చేసుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రజత్ భార్గవ్ తన ప్రకటనలో అభ్యంతరం తెలిపారు.