అమిత్ షాకు మళ్లీ అస్వస్థత !

కోవిడ్ 19కి గురై కోలుకున్న కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తటంతో శనివారం రాత్రి ఆయనను ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్చారు. అయితే హాస్పటల్ వర్గాలు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో అమిత్ షాకు చికిత్స జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఆగస్టు 2న కోవిడ్ 19 పాజిటివ్ రావటంతో అమిత్ షా గురుగ్రామ్ లోని ఓ హాస్పటల్ లో చికిత్స పొందారు. అనంతరం కరోనా నుండి కోలుకుని ఆగస్టు 14న డిశ్చార్జ్ అయ్యారు. అయితే కోవిడ్ తరువాత కనిపించే అనారోగ్య లక్షణాలతో అమిత్ షా అదే నెల 18న ఎయిమ్స్ లో చేరి 31వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు తిరిగి అస్వస్థతకు గురయ్యారు.

వివిఐపిలకు మాత్రమే ప్రత్యేకమైన ఎయిమ్స్ లోని కార్డియో న్యూరో టవర్ లో చికిత్స పొందుతున్న అమిత్ షా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టుగా సమాచారం.