బీజేపీ వర్సెస్ వైసీపీ… ఆట మొదలైంది…

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ హయాంలో వైసీపీి బీజేపీ పోరు హోరాహోరీగా ఉండేది. వీర్రాజు రాకతో పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. వీర్రాజు వస్తూ వస్తూనే మా టార్గెట్ టీడీపీ అనడం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పడంతో వైసీపీ వాళ్లకు పరోక్షంగా ఆనందం కలిగింది. మూడు రాజధానుల విషయంలో తమ చేతిలో ఏమీ లేదని చెప్పడం ద్వారా బీజేపీ వైసీపీనే సమర్థించినట్టయింది. అటు కేంద్రం కూడా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల విషయంలో వైసీపీ సపోర్ట్ కోరడంతో ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య ఏర్పడినట్టయింది.

అయితే రాష్ట్రంలో రథాల దహనకాండ ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. రాష్ట్రంలో జనసేన, టీడీపీతో కలసి బీజేపీ మత రాజకీయాలు చేయాలని చూస్తున్నా.. వైసీపీ సంయమనం పాటించింది. వైసీపీ నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు కానీ, బీజేపీని ఇప్పటి వరకూ టార్గెట్ చేయలేదు.

తాజాగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేరుగా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఏపీలో బీజేపీ పాగా వేసేందుకే ఇక్కడ మతపరమైన అంశాలను లేవదీస్తోందని మండిపడ్డారు మంత్రి వెల్లంపల్లి. దేవాలయాలపై రాజకీయాలు చేయడం మానేయాలని, రాష్ట్రంలో ఏదో జరుగుతోందనే భ్రమల్లోకి ప్రజల్ని నెట్టేసి, ప్రభుత్వంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు మంత్రి.

2017 అక్టోబర్ లో పశ్చిమగోదావరి జిల్లాలో రథం దగ్ధమైన సంఘటనను గుర్తు చేస్తూ.. అప్పటి ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ ఆ ఘటనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో బీజేపీ అధికార పార్టీపై విమర్శలు చేస్తే.. అంతకంటే వందరెట్లు ఎక్కువగా అధికార టీఆర్ఎస్ బీజేపీని చెడుగుడు ఆడుకుంటోంది.

ఏపీలో మాత్రం వైసీపీ ఇప్పటికీ తమ ప్రత్యర్థిగా టీడీపీనే భావిస్తోంది. అందుకే బీజేపీ మాటల్ని లైట్ తీసుకుంటూ వచ్చారు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు. ఇప్పుడు బీజేపీ వ్యూహం ఏంటో వైసీపీకి కూడా పూర్తిగా అర్థమవుతోంది. జనసేన, టీడీపీని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో మత రాజకీయాలను ప్రోత్సహించి లబ్ధిపొందాలని చూస్తోన్న బీజేపీకి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు వైసీపీ నేతలు.

మంత్రి వెల్లంపల్లి ముందుగా బీజేపీ నోరు మూయించాలని చూస్తున్నారు. ఆయనకి మద్దతుగా ఎంతమంది తెరపైకి వస్తారో చూడాలి. వైసీపీ నేతలు రాష్ట్ర బీజేపీని మాత్రమే ఉతికి ఆరేస్తారా, లేక జాతీయ నాయకత్వానికి కూడా ఘాటుగా సమాధానం చెబుతారా అనే విషయం ముందు ముందు తేలాల్సి ఉంది.