అవినీతి కేసులో మళ్లీ దొరికిన బాబు సన్నిహితుడు బొల్లినేని గాంధీ

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న, హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్‌లోని సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బొల్లినేని శ్రీనివాస గాంధీ మరోసారి సీబీఐకి దొరికారు. ఒక కేసులో నిందితులకు అనుకూలంగా పరిస్థితులను మార్చేందుకు 5 కోట్లు లంచం తీసుకున్న వ్యవహారంలో బొల్లినేని గాంధీని సీబీఐ బుక్ చేసింది. ఆయనపై కేసు నమోదు చేసింది.

గతేడాది కూడా బొల్లినేని గాంధీపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. 200 కోట్ల వరకు అక్రమాస్తులను గుర్తించింది. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలోనే గతేడాది అక్టోబర్‌ 31న బొల్లినేని గాంధీ జీఎస్టీ కమిషనరేట్‌లోనూ భారీగా లంచాలు తీసుకుంటున్నట్టు సీబీఐకి ఫిర్యాదు వచ్చింది.

రంగంలోకి దిగిన సీబీఐ ఇన్సినిటీ మెటల్ ప్రొడక్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ అక్రమంగా ఇన్‌పుట్‌ క్రెడిట్ ట్యాక్స్ పొందిందన్న కేసులో నిందితులకే అనుకూలంగా పరిస్థితులను మార్చేందుకు బొల్లినేని గాంధీ, మరో ఉన్నతాధికారి ప్రయత్నించారని గుర్తించింది. ఇందుకోసం ఐదు కోట్లు లంచం తీసుకునేందుకు డీల్ మాట్లాడుకున్నారు. తొలుత 10 లక్షలు నగదు రూపంలో తీసుకున్నారు. మిగిలిన సొమ్ముకు భూములు కొని ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు.

రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసును చేధించింది. బొల్లినేని శ్రీనివాస్‌ గాంధీతో పాటు, చిలుక సుధారాణిపై కేసు నమోదు చేశారు. గాంధీ చంద్రబాబుకు నమ్మిన బంటు. చంద్రబాబు అండతోనే ఏ అధికారికి సాధ్యం కాని రీతిలో హైదరాబాద్‌ ఈడీలో 13 ఏళ్ల పాటు ఎలాంటి బదిలీ లేకుండా గాంధీ చక్రం తిప్పారు.

చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ అంశాలను డైవర్ట్ చేయడానికి వెంటనే ఈడీ అధికారి హోదాలో జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసును కదిలించడం, పలాన ఆస్తి అటాచ్ అంటూ ప్రకటన ఇవ్వడంలో గాంధీ కీలక పాత్ర పోషించారు. ఈయనకు తోడుగా దేవేందర్‌ గౌడ్ మేనల్లుడు కూడా చంద్రబాబుకు అనుకూలంగా పనిచేశారని అప్పట్లో వైసీపీ చాలాసార్లు ఆరోపించింది.