చిత్తూరు జిల్లాను కలవరపెడుతున్న కరోనా మరణాలు…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నా.. మరణాల రేటులో పెరుగుదల లేకపోవడం ఊరటనిచ్చే అంశం. కరోనా కేసుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న ఏపీ.. మరణాల రేటులో మాత్రం 13వ స్థానంలో ఉంది.

ఏపీలో కరోనా మరణాల రేటు చాలా తక్కువ, కేవలం 0.9 శాతం మాత్రమే. అంటే వందమందిలో కేవలం ఒక్కరు మాత్రమే కరోనాతో మరణిస్తున్నారు.

ఇక ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల సంఖ్యను విశ్లేషిస్తే.. చిత్తూరు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేసుల సంఖ్యలో చిత్తూరు ఐదోస్థానంలో ఉన్నా.. కరోనా మరణాల్లో మాత్రం నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 520. ఏపీలో మొత్తం కరోనా మరణాలు 4846. ఏపీలోని 13 జిల్లాలకు సగటు తీస్తే.. ఒక్కో జిల్లాలో 373 మరణాలు సంభవించినట్టు లెక్క.

అయితే చిత్తూరులో మాత్రం ఏకంగా 520మంది చనిపోయారు. రాష్ట్ర సగటుకంటే ఇది 147ఎక్కువ. చిత్తూరు తర్వాత మరణాల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న జిల్లా గుంటూరు. అక్కడ 459మంది కరోనాతో కన్నుమూశారు. ఈ రెండు జిల్లాల మధ్య తేడా 61. అంటే చిత్తూరులో కరోనా మరణాల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కరోనా కేసుల్లో టాప్ ప్లేస్ లో ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో కూడా ఈ స్థాయిలో మరణాలు లేవు. ఇటీవల జిల్లాల కలెక్టర్లతో కొవిడ్ పై జరిగిన సమీక్షలో కూడా ముఖ్యమంత్రి జగన్ వద్ద ఇదే అంశం ప్రస్తావనకు వచ్చిందట. చిత్తూరు జిల్లాలో కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారట. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కలెక్టర్ కి సహాయకంగా ప్రత్యేక అధికారిణి ని నియమించబోతున్నట్టు తెలుస్తోంది.

అసలు చిత్తూరు జిల్లాలోనే కొవిడ్ మరణాల సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉందనే విషయంపై పూర్తిస్థాయిలో సీఎం కార్యాలయం అధికారుల నివేదిక కోరిందట. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకోవడంతో చిత్తూరు జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య ఓ దశలో భారీగా పెరిగింది. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గినా.. మరణాలు మాత్రం తగ్గడంలేదు.

ఇటీవల కాలంలో రోజుకి సగటున 10మంది చిత్తూరు జిల్లాలో మరణిస్తున్నారు. జిల్లాలో కొవిడ్ బారిన పడినవారిలో ఎక్కువమందికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో.. వారంతా కరోనా కోరలకు బలవుతున్నారని అధికారుల సమాచారం.

ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. చిత్తూరుని మాత్రం కరోనా వణికిస్తోంది. మరణాల సంఖ్యపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి, స్థానికంగా సకాలంలో మెరుగైన వైద్యం అందించకపోతే రాబోయే రోజుల్లో మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశముంది.