Telugu Global
National

ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరిన వైసీపీ ప్రభుత్వం...

ఏపీ ఫైబర్ గ్రిడ్ పేరుతో రాష్ట్రంలో 2 వేలకోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం చివరకు ఈ విషయంపై సీబీఐ విచారణ కోరింది. ఇప్పటికే ఈ కుంభకోణంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి నిజా నిజాలు వెలికి తీసింది ప్రభుత్వం. సబ్ కమిటీ విచారణలో బాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలన్నీ బైటపడ్డాయి. హైకోర్టుకి కూడా దీనికి సంబంధించిన వివరాలన్నిటినీ సమర్పించిన ప్రభుత్వం.. సీబీఐ ద్వారా మొత్తం వ్యవహారం గుట్టురట్టు చేయాలనుకుంటోంది. […]

ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరిన వైసీపీ ప్రభుత్వం...
X

ఏపీ ఫైబర్ గ్రిడ్ పేరుతో రాష్ట్రంలో 2 వేలకోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం చివరకు ఈ విషయంపై సీబీఐ విచారణ కోరింది. ఇప్పటికే ఈ కుంభకోణంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి నిజా నిజాలు వెలికి తీసింది ప్రభుత్వం. సబ్ కమిటీ విచారణలో బాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలన్నీ బైటపడ్డాయి. హైకోర్టుకి కూడా దీనికి సంబంధించిన వివరాలన్నిటినీ సమర్పించిన ప్రభుత్వం.. సీబీఐ ద్వారా మొత్తం వ్యవహారం గుట్టురట్టు చేయాలనుకుంటోంది.

కేబినెట్ సబ్ కమిటీ తేల్చిన విషయాలివే..

  • 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ పేరుతో రాష్ట్రంలో ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడంలో, ఏపీ ఫైబర్ టెలివిజన్ ప్రసారాలలో, ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వడంలో, సెట్ టాప్ బాక్స్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది.
  • ఈ అవినీతి, అక్రమాల విలువ దాదాపు 2వేల కోట్ల రూపాయలు.
  • అప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రధాన సూత్రధారి కాగా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి సాంకేతిక సలహాదారుగా ఉన్న వేమూరి హరికృష్ణ చౌదరి ప్రధాన పాత్రధారి.
  • టెరాసాఫ్ట్, టెరాసాఫ్ట్ అనుబంధ కంపెనీల్లో వాటాలున్న వేమూరి హరికృష్ణ చౌదరి.. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నిటిలో తమ కంపెనీలకు భారీ లాభాన్ని చేకూర్చారు.
  • ప్రభుత్వం తరపున ఏపీ ఫైబర్ నెట్ కుదుర్చుకునే ప్రతి ఒప్పందంలోనూ హరికృష్ణ కీలకంగా వ్యవహరించారు, ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు.

భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ ఫేజ్-2 కోసం చేపట్టిన 907.94 కోట్ల రూపాయల పనుల్లో పరికరాల రేట్లు భారీగా పెంచేసి టెరాసాఫ్ట్ లాభపడిందని కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది.

బీబీఎన్ఎల్ ఫేజ్ -2 పనుల్ని ఉద్దేశపూర్వకంగానే 11.26 శాతం ఎక్సెస్ కి అప్పగించారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటు చేసేందుకు 329కోట్ల రూపాయలతో టెరాసాఫ్ట్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇక్కడ కూడా నిబంధనలకు పాతరేశారు. అన్ని అర్హతలున్నవారిని కాదని, టెరాసాఫ్ట్ కే పనులు అప్పగించారు. ఇందులో కూడా భారీ అవినీతి జరిగిందని సబ్ కమిటీ తేల్చింది. ఇక ప్రాజెక్ట్ మానిటరింగ్ ఏజెన్సీ పేరుతో మరో అక్రమానికి ఏపీఎస్ఎఫ్ఎల్ తెరలేపిందని తెలుస్తోంది.

ఈ మానిటరింగ్ ఏజెన్సీని జెమిని కమ్యూనికేషన్స్ అనే సంస్థకు అప్పగించారు. దీనికోసం నియమాలు సడలించారు, మిరాక్స్ టెక్నాలజీస్ కి ఇచ్చిన టెండర్ క్యాన్సిల్ చేసి మరీ జెమిని కమ్యూనికేషన్స్ సంస్థకు ఈ ఏజెన్సీని అప్పగించారని స్పష్టంగా తెలుస్తోంది. డిష్ కనెక్షన్లకోసం ఇచ్చే సెట్ టాప్ బాక్స్ ల విషయంలో కూడా భారీ గోల్ మాల్ జరిగిందని సబ్ కమిటీ నివేదిక చెబుతోంది.

సెట్ టాప్ బాక్స్ టెండర్లలో ఎల్-3గా నిలిచిన టెరా సాఫ్ట్ కే ఆ ప్రాజెక్ట్ ని అప్పగించారు. ఇవన్నీ చాలదన్నట్టు ఏపీఎస్ఎఫ్ఎల్ మెయింటెనెన్స్ బాధ్యతను కూడా టెరాసాఫ్ట్ కే ప్రభుత్వం అప్పగించింది. మొత్తం 13 జిల్లాల్లో ఫైబర్ నెట్వర్క్ సంబంధించి మెయింటెనెన్స్ వ్యవహారాలు చూసినందుకు నెలకు 2.44కోట్లు ఈ సంస్థకు దారాధత్తం చేశారట.

ఇలా ఐదేళ్లలో సుమారు 2వేలకోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా కేబినెట్ సబ్ కమిటీ లెక్క తేల్చింది. ఈ వివరాలన్నిటితో సీబీఐ విచారణ కోరింది ప్రభుత్వం.

First Published:  13 Sep 2020 6:20 AM GMT
Next Story