కంగనాపై పేలిపోయిన ప్రకాశ్‌ రాజ్ సెటైర్‌

కొద్దికాలంగా హీరోయిన్ కంగనా రనౌత్ హల్‌చల్ చేస్తున్నారు. నేరుగా మహారాష్ట్ర  ప్రభుత్వంతోనే ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు అండగా ఉండడం, వై ప్లస్ భద్రత కూడా కల్పించడంతో కంగనా మరింత దూకుడుగా ముందుకెళ్లారు. ఆమెను కొందరు ఆకాశానికెత్తేస్తున్నారు. బీజేపీ జాతీయ మీడియా సంస్థలు ఆమెకు మరింత ప్రచారం కల్పిస్తున్నాయి.

కొన్ని తెలుగు మీడియా సంస్థలు కూడా ఆమెను క్వీన్‌ అంటూ, ధైర్యశాలి అంటూ ప్రశంసిస్తున్నాయి. ఆమె విధానాన్ని వ్యతిరేకించేవారు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశాంతంగా పనిచేసుకునే అవకాశం లేకుండా చేసేందుకు భద్రత ఇచ్చి మరీ ఇలాంటి వారిని బీజేపీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు విపక్షాల నుంచి ఉన్నాయి.

ఇటీవల నటుడు విశాల్‌ .. కంగనా రనౌత్‌ను కీర్తిస్తూ ఆమెను భగత్‌ సింగ్‌తో పోల్చారు. కొందరు ఆమెను ఝాన్సీ లక్ష్మీభాయ్‌తో పోల్చారు. ఈ నేపథ్యంలోనే నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్ వేశారు.

‘ఒక్క సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్‌ పాత్ర పోషిస్తే నిజంగా ఝాన్సీ లక్ష్మీ భాయ్‌ అయిపోతారా? అని ప్రశ్నిస్తూ… అలా అయితే… దీపికా పదుకోనె‌ రాణీ పద్మావతి, హృతిక్‌ రోషన్‌ అక్బర్, అమీర్‌ ఖాన్‌ మంగల్‌ పాండే, అజయ్‌ దేవగన్‌ భగత్‌ సింగ్, వివేక్‌ ఒబెరాయ్‌ మోదీ అయిపోవాలి కదా అంటూ ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్ చేశారు. ఆయా నటులు పోషించిన పాత్రలకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు.